అవినీతికి అండగా !

బోఫోర్స్‌ స్కాం మొదలు నేటి వరకు మన దేశంలో జరుగుతున్న స్కాంలకు లెక్కే లేకుండా పోయింది. అదే విధంగా స్కాముల్లో గల్లంతవుతున్న ప్రజాధనానికి కూడా లెక్క లేకుండా పోయింది. బోఫోర్స్‌ స్కాం విలువ 60 కోట్ల రూపాయలని వార్తలు రాగానే ‘అమ్మో అన్ని పైసలా!’ అంటూ ప్రతి భారతీయుడు ముక్కున వేలేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత జరుగుతున్న స్కాంలు, కొంచెంచెంగా పెరుగుతున్న వాటి విలువలు వింటూ వింటూ ఎంత భారీ మొత్తం గల్లంతైనా ఏమాత్రం ఆశ్చర్యపోవడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన 2జీ కుంభకోణంలో లక్షా 72 వేల కోట్లు చేతులు మారాయని తెలిసినా చీమ కుట్టినట్లయినా ఏ భారత పౌరుడు స్పందించలేదు. మన రాజకీయ నాయకులంతే.. మన ఖర్మింతే.. అని ఊరుకున్నట్లున్నాడు. ఇదిలా ఉంటే, దేశంలో జరుగుతున్న ప్రతి స్కాంలో ఏదో రాజకీయ నాయకుడి పేరు తప్పకుండా ఉంటున్నది. నాటి బోఫోర్స్‌ స్కాంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ పేరుండగా, మొన్న జరిగిన 2జీ కుంభకోణంలో కేంద్ర టెలికాం మంత్రి రాజా, హోం మంత్రి చిదంబరం పేర్లు వచ్చాయి. ఈ భారీ స్కాం తరువాత జరిగిన బొగ్గు, గనుల కుంభకోణంలో సాక్షాత్తు మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పేరు కూడా వచ్చింది. ఇన్ని స్కాంలు జరిగినా, ఎంత మహామహుల పేర్లు ఆ స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొన్నా, ఎవరికి వారు తాము నిర్దోషములమని నిరూపించుకునేందుకు పోరాడారు. కానీ, స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అవినీతి ఆరోపణలు అందుకుంటున్న మంత్రులకు న్యాయం సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నది. ఇది ముమ్మాటికీ వివాదాస్పద నిర్ణయమే. జగన్‌ మనీలాండరింగ్‌, భూ కుంభకోణాల కేసుల్లో ఐదుగురు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లలో ఐదుగురికి న్యాయ సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో న్యాయ సహాయం అందక ఎంతో మంది పేదవాళ్లు అల్లాడుతున్నారు. వాళ్లపై లేని కరుణ ప్రభుత్వానికి తమ మంత్రులపైనే ఎందుకు కలిగింది ? ‘అవినీతి’ మంత్రులకు ప్రభుత్వం న్యాయ సహాయం చేయాలనుకుంటున్నదంటే, ఈ కుంభకోణాల్లో ప్రభుత్వ ప్రమేయం కూడా ఉన్నదేమోనన్న అనుమానాలు ప్రజలకు కలుగక మానవు. ప్రభుత్వ ఈ నిర్ణయం అవినీతిపరులకు, అక్రమార్కులకు సానుకూల సందేహాలు పంపుతుందనడంలో ఏమాత్రం సంశయం అక్కరలేదు. దీంతో సదరు అవినీతి స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు నిర్భయంగా తిరుగుతారు, చాటుమాటున అవినీతికి పాల్పడుతున్న వారు ఇక బాహాటంగానే తమ అధికార లాఘవాన్ని ప్రదర్శిస్తారు. ఇటువంటి పరిస్థితులు నెలకొంటే పాలన వ్యవస్థ సంగతేమిటి ? భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏ పార్టీ పాలించినా ప్రజలు విశ్వసించరు. అంతేగాక, ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం కోల్పోతారు. ప్రజామోదం పొందలేని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా పాలకులు జాగ్రత్త పడాలి. అవినీతి అండగా నిలిచే ఇలాంటి చర్యలను మానుకోవాలి. సదరు మంత్రులకు న్యాయం చేస్తామన్న ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే, ప్రజాగ్రహానికి తట్టుకోవడానికి సిద్ధపడాలి.