అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 8 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యవత ఉద్యమించాలని అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార స్వామి పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్‌ సమావేశానికి ప్రత్యేక అతిథిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల దేశంలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం విద్య, వైద్యంను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నందునా యువత మేల్కొని పోరాటాలు చేయాలన్నారు. ఈ నెల 13, 14 తేదీలలో హైదరాబాద్‌లో నేటి రాజకీయాలు, యువత పాత్ర అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్‌, ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వచ్చే నెల 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్‌ నాయకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.