అవిశ్వాసానికి ఓకే

– ఎట్టకేలకు అవిశ్వాసానికి అనుమతి
– తెదేపా ఎంపీ అందించిన అవిశ్వాస తీర్మానాన్ని చదివిన స్పీకర్‌
– అవిశ్వాసానికి మద్దతుగా నిలిచిన 50మందికి పైగా సభ్యులు
– కాంగ్రెస్‌తో సహా పలు ప్రాంతీయ పార్టీల మద్దతు
– అవిశ్వాసానికి మద్దతివ్వని తెరాస సభ్యులు
– చర్చకు అనుమతిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌
– 10 రోజుల్లో చర్చా తేదీని ప్రకటిస్తానన్న స్పీకర్‌
– ప్రధానప్రతిపక్షంగా ఉన్న తమ అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించిన కాంగ్రెస్‌
– తొలుత నోటీసు ఇచ్చిన వారికి ప్రాధాన్యత నిచ్చామన్న స్పీకర్‌
– సభ ప్రారంభం నుంచి వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టిన తెదేపా
న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : ఎట్టకేలకు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభించింది. విభజన చట్టంలోని హావిూలపై చర్చించాలని, ప్రత్యేక ¬దా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ ఓకే చెప్పారు. 10రోజుల్లో అవిశ్వాసంపై చర్చ నిర్వహిస్తామని, త్వరలో తేదీని ప్రకటిస్తానని స్పీకర్‌ ప్రకటించారు.  బుధవారం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభంకాగానే.. అవిశ్వాసంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం జరిగింది. ఉదయం సభ ప్రారంభంకాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులతో స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ ప్రశ్నోత్తరాలను టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. సభకు సహకరించాలని స్పీకర్‌ పదే పదే కోరినా ఎంపీలు వెనక్కు తగ్గలేదు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులను ప్రదర్శించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత నిర్ణయిద్దామని చెప్పినా ఎంపీలు వినిపించుకోలేదు. దీంతో ఎంపీల ఆందోళన మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక ఎంపీలు మళ్లీ అవిశ్వాసంపై చర్చించాలని పట్టుబట్టగా.. కాంగ్రెస్‌ కూడా మద్దతు పలికింది. వెంటనే అవిశ్వాంపై చర్చ ప్రారంభించాలని కోరింది. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్‌ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్‌ తెలిపారు. తెదేపా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్‌ కోరగా అనేక పార్టీల ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలిపుతూ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు.
మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్‌ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్పీ, ఆప్‌, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీ ఉన్నారు. దాదాపు 50మందికిపైగా ఎంపీలు లేచి నిలబడి టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతినిస్తామని, అయితే చర్చ ఎప్పుడన్నది తర్వలోనే నిర్ణయిస్తామని స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ తెలిపారు. 10 రోజుల్లోగా అవిశ్వాసంపై చర్చ చేపట్టాలన్న నిబంధనను టీఎంసీ సభ్యుడు సౌగత్‌ రాయ్‌ గుర్తు చేశారు. దీంతో తేదీని ప్రకటిస్తామని స్పీకర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేయగా.. ఏదైనా నిబంధనల ప్రకారమే జరగాలని సుమిత్రా
నచ్చజెప్పారు. కాంగ్రెస్‌ చర్చకు పట్టుబట్టడంపై పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్‌ స్పందించారు. విపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు.  ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో ఉందని, అలాంటిది కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తీర్మానాన్ని కాకుండా, తెదేపా ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించటంలో ఆంతర్యమేంటని స్పీకర్‌ను కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత ఖార్గే ప్రశ్నించారు. దీంతో స్పందించిన స్పీకర్‌ మాట్లాడుతూ.. తొలుత  నోటీసులిచ్చిన వారికి ప్రాదాన్యతనిచ్చినట్లు స్పీకర్‌ తెలిపారు.
అవిశ్వాసానికి మద్దతివ్వని తెరాస..
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీలు మద్దతు ఇవ్వలేదు. పార్లమెంట్‌లో తెదేపా అవిశ్వాసానికి మద్దతు తెలిపేవారు నిల్చోవాలని స్పీకర్‌ కోరగా కాంగ్రెస్‌, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ పక్కనే పక్క రాష్ట్రమైన తెరాస ఎంపీలు మద్దతివ్వకపోవటం ఆశ్చర్యానికి గురిచేసింది. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్‌ తమకు ఆదేశాలు ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు ఎంఐఎం తరపున ఒకేఒక ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడ్డారు.
రాజ్యసభలో తెదేపా ఎంపీల ఆందోళన..
మరోవైపు రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సభకు సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య పదే, పదే కోరినా సభ్యులు వినలేదు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభంకాగానే.. మళ్లీ ఎంపీలు నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన వెంకయ్య.. చర్చకు సిద్ధమని ప్రకటించారు. అంతకముందు కూడా టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌ ముందు ధర్నాకు దిగారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో పోటీపోటీగా నిరసన తెలిపారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ ద్వారం దగ్గర ఆందోళన చేస్తే.. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిలు ధర్నా చేశారు. వారికి మాజీ ఎంపీలు కూడా మద్దతు పలికారు. అయితే మార్షల్స్‌ మాజీ వారిని అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం మాజీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలపకూడదని చెప్పారు. దీంతో వారు ప్లకార్డులు లేకుండా నిరసన తెలిపారు