అవి టీఆర్‌ఎస్‌ రైతు సమితులు

– తెలంగాణ ఇచ్చింది సోనియానే

– రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా

కరీంనగర్‌,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంఘాలు రైతు సమితిలు కాదు అవి టీఆర్‌ఎస్‌ సమితులని టిపిసిసి ఇంచార్జీ కుంతియా ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రైతుబాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులపై ఏ అవగాహన లేకుండా కీర్తి కండూతితో కెసిఆర్‌ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు భూ ప్రక్షాళనల పేరిట జిమ్మికులు చేస్తున్నాడని ఏనాడో కాంగ్రెస్‌ భూ సర్వేను సమగ్రంగా చేసిందని గుర్తు చేశారు. బిసిలకు వెయ్యి కోట్లు అంటూ వారిని దగా చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై కేసులు పెడుతున్న టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అధికారులు జాగ్రత్తగా వుండాలని తాము 2019లో అధికారంలోకి రాగానే దీనికి మూల్యం వడ్డీతో సహా తీర్చుకుంటామని హెచ్చరించారు. భూపాలపల్లిలో గిరిజన మహిళలపై దాడులు అమానుషం అన్నారు. ఇందిరమ్మరైతుబాటలో వందరోజులు గ్రామాల్లో తిరుగాలని సూచించారు. బతుమ్మ చీరలు టిఆర్‌ఎస్‌ పాలన వలే నాసిరకంగా వున్నాయని ఎద్దేవా చేశారు. బతుకుమ్మ చీరలను మహిళలు తిరస్కరిస్తున్నారని అన్నారు. జగిత్యాలలోజీవన్‌ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. తెలంగాణశాసనసభ పక్షనేత జానారెడ్డి మాట్లడుతూ 1970లోనే భూ సర్వేలు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిందని తెచ్చింది కాంగ్రెస్‌ అని గ్రామాల్లో బలంగా తీసుకొని పోవాలని అప్పుడే మనం వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్నారు. పొన్న ప్రభాకర్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ దళిత బహుజనులను దాడులు చేస్తూ నియంతలాగా వ్యహరిస్తున్నడని దుయ్యబట్టారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణలో నియంతల రాజ్యం నడుస్తోందని మాటలు మాత్రమే చెబుతున్నారని చేతలు శూన్యమని విమర్శించారు. మల్లుబట్టివిక్రమార్క మాట్లాడుతూ ఇంటింటికి వెళ్ళి రెవెన్యూ సమప్యలు తెలుసుకోవాలని కార్యకర్తలను కోరారు. భూములను ఎన్నో పంపిణీ చేశామని గతం గొప్పలు చెప్పారు. భూమి పంపిణీ కోసం మావోయిస్టులతో చర్చలు జరిపామని అన్నారు. కొప్పులరాజు మాట్లాడుతూ గ్రామాల్లో మూడెకరాల భూమి డబుల్‌ బెడ్‌రూం అంశాలపై విస్తృతంగా చర్చ జరుపాలని ప్రభుత్వంను ప్రజలు నిలదీసేలా చైతన్యం చేయాలని కోరారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌, బొమ్మ వెంకటేశ్వర్లు ఉప్పుల అంజనీ ప్రసాద్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ళ శారద కోడూరి సత్యనారాయణగౌడ్‌ పొన్నం సత్యంగౌడ్‌ పొన్నం శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.