అవును.. అక్కడ.. అది మామూలే..!

ఆయనన్నది నిజం. అదే.. రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్‌ మొన్న అన్న మాటలు నిజంగా నిజం. ఆయనన్నది ఆయనకు సంబంధం లేని ప్రాంతం గురించి కాదు. ఆయన పుట్టిన ప్రాంతం గురించే. ఆయనేమన్నాడు. రాయలసీమలో చంపడం, చంపమనడం సాధారణమేనని. అవును, ఆయనన్నది నిజం. అదక్కడ మామూలే. గుడ్లు పీకడం, బహిష్కరించడం అక్కడి బడుగులకు కొత్తేమీ కాదు. ప్రేమ వివాహాలు చేసుకుంటే గుండ్లు గీయించడం, టెండర్లు వేస్తే జీపులు పేల్చేయడం, సాంఘిక న్యాయం అడిగితే వేంపటలో చేసిన విధంగా సామూహిక దహనాలు చేయడం రాయలసీమలో మామూలే. అణగారిన వర్గాలను అగ్రవర్ణాలు ఇంకా అక్కడ అణగదొక్కడం మామూలే. చల్లా రామకృష్ణారెడ్డి ఇంటి వైపు తలెత్తి చూస్తే, కట్టేసి కొరడా దెబ్బలు కొట్టారక్కడ. చల్లా రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధి కదా! అందుకే కావచ్చు! అక్కడ ప్రజాప్రతినిధులు అలాగే ఉంటారు మరి ! మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి స్వగ్రామం లద్దగిరి బస్టాండ్‌లో కూర్చున్నోళ్లు, నేటికీ టాపు లేని జీపులు ముందు నుంచి వెళితే లేచి దండాలు పెట్టాల్సిందే. పెట్టకుంటే తప్పవు కదా అరదండాలు. ఇప్పుడు రాయలసీమ నేరగాళ్ల రాజ్యం. అంతకు ముందు పాలెగాళ్ల రాజ్యం. న్యాయంగా రావల్సిన ఆర్డీఎస్‌ తూమును బాంబులతో పేల్చి, నీళ్లను దోచుకోవడం లాంటి సంఘటనలు అక్కడ కోకొల్లలు. అక్కడ దోచుకోవడం, దోపిడీ చేయడం, దౌర్జన్యం చేయడం, ఆక్రమించుకోవడం, ఆక్రమించుకున్నదంతా అప్పనంగా సొంత వాళ్లకే కట్టబెట్టడం నిజంగా అక్కడ మామూలే. అక్కడ దోచుకున్నది, దోపిడీ చేసింది చాలక పక్క ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా దోచుకోవడం, దోపిడీ చేయడం, పేదల కడుపులు వాళ్ల సమాధుల మీద మేడలు కట్టుకోవడం అక్కడి వాళ్లకే సాధ్యం. రాజశేఖరరెడ్డిలాంటి తండ్రి చేతికి అధికారం వస్తే, జగన్‌లాంటి కొడుకులు పుట్టుకురావడం అక్కడ మామూలే. వేల కోట్లు కొల్లగొట్టి, కేసుల్లో ఇరుక్కుని, జైలుకు వెళ్లి, రోజుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, బయటకు వచ్చి మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న జగన్‌లాంటి వాళ్లకు కొదువ లేదక్కడ. అవును.. ఇదంతా అక్కడ మామూలే. టీజీ చెప్పిందంతా నిజమే. అంత పెద్ద దోపిడీదారులు, ఆక్రమణదారులు, హంతకులు ఉండీ.. ఇదంతా అక్కడ మామూలేనని చెప్పే టీజీలాంటి వాళ్లు కూడా ఉండి, ఆ ప్రజాస్వామ్య వ్యతిరేకులకు వత్తాసు పలుకుతూ, ప్రోత్సహిస్తుంటే అక్కడ సాగుతున్న ఏ రాజ్యమో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి ‘మహామహులు’ ఉన్న, పుట్టిన, పడుతున్న, ఇంకా పుట్టే అవకాశమున్న ఆ రాయలసీమను, ఆ మహామహుల చేతిలో బలైపోయి, ఇప్పుడిప్పుడే తిరగబడుతున్న తెలంగాణతో కలుపుకుని మళ్లీ ఆ టీజీయే రాయల తెలంగాణ కోరడం సమంజసమా ? ఆయన ప్రాంతం గురించి ఆయనకే అంత ‘మంచి’ అభిప్రాయమున్నప్పుడు, ఆయన ప్రాంతం వాళ్ల చేతిలో దగా పడ్డ తెలంగాణ బిడ్డలకు, ఆయన ప్రాంతంపై ఎలాంటి అభిప్రాయం ఉంటుందో పాపం టీజీకి అర్థమవడం లేదు. అందుకే, తన ప్రాంత ‘విశిష్టత’ను తానే చెప్పుకుంటూ, రాయల తెలంగాణ అడగడం ఆయన జిత్తులమారితనానికి నిదర్శనం. ఏదేమైనా, టీజీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఎందుకంటే, ఆయన ప్రాంతం గురించి ఆయనే చెప్పి, ఇతర ప్రాంతాల వారికి ఆయన ప్రాంతం రాయలసీమ నుంచి ముప్పుందన్న సమాచారం ఇచ్చినందుకు.