అసంపూర్ణ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలతో ఓట్లు రాలవు


బీజేపీపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విమర్శలు
లక్నో,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి భారతీయ జనతాపార్టీపై విమర్శలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరా అసెంబ్లీ ఎన్నికల ముందు అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా బీజేపీకి ఓట్లు రాలవని ఆమె విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ సోమవారం యూపీలోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ కారిడార్‌ను ప్రారంభించిన మరసటి రోజే మాయావతి ఈ
విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీలో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికప్పుడే ప్రకటనలు చేస్తున్నాయి, నూతన ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేస్తున్నాయి, పూర్తికాకపోయినా అసంపూర్ణ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఇవేవీ బీజేపీ ఓటు బ్యాంకును పెంచవని మాయావతి వ్యాఖ్యానించారు. అదేవిధంగా సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)పై కూడా ఆమె విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుంచి తొలగించిన వాళ్లను, ప్రజల్లో పట్టులేని వాళ్లను, స్వార్థపరులను చేర్చుకోవడంవల్ల ఏ రాజకీయ పార్టీకి లబ్ది చేకూరదని ఎస్పీని ఉద్దేశించి అన్నారు.