ఆండ్రియా పెట్కోవిక్‌కు గాయం హోప్‌మెన్‌ టోర్నీకి దూరం

బెర్లిన్‌, జనవరి1: జర్మనీ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆండ్రియా పెట్కోవిక్‌ మోకాలికి గాయమైంది. ఫలితంగా హోప్‌మెన్‌ కప్‌ టెన్నిస్‌టోర్నీ నుంచి తప్పుకుంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నికి కూడా ఈ టెన్నిస్‌ భామ దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకుల పట్టికలో టాప్‌-10 ర్యాంకులో కొనసాగుతున్న పెట్కోవిక్‌ గత శనివారం జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ టోర్నమెంట్‌లో భాగంగా సింగిల్స్‌ విభాగంలోని ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టీనేజర్‌ అష్లైగ్‌ బర్టీతో తలపడింది. మ్యాచ్‌ మధ్యలో గాయం బారిన పడడంతో మ్యాచ్‌ మధ్యలోనే నిష్క్రమించింది. అంతకుముందు జరిగిన తొలిసెట్‌లో పెట్కోవిక్‌ విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా పెట్కోవిక్‌ మోకాలి గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.