ఆందోళన విరమించండి

5

– న్యాయశాఖ మంత్రితో మాట్లాడుతా

– తెలంగాణ అడ్వకేట్లకు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ హామీ

న్యూఢిల్లీ,జులై 3(జనంసాక్షి):తెలంగాణా న్యాయవాదులు చేపట్టిన సమ్మె విరమిస్తే తాను సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌ హావిూ ఇచ్చారని తెలంగాణా న్యాయవాద సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదివారం తెలంగాణా న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఆయన అధికార నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణాలో న్యాయమూర్తుల సస్పెన్షన్‌ తర్వాత ఏర్పడిన పరిస్ధితులను వివరించామని తెలంగాణా న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఎం. రాజేందర్‌ రెడ్డి, జి. మోహన్‌ రావు, జి. జితేందర్‌ రెడ్డి విలేకరులకు తెలిపారు.న్యాయాధికారుల నియామకాలను వెంటనే నిలిపివేయాలని, న్యాయమూర్తుల సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించడానికి జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. దాదాపుగా గంట సేపు జరిగిన సమావేశంలో తాము చెప్పిన విషయాలను ప్రధాన న్యాయమూర్తి సావధానంగా విన్నారని తెలంగాణా న్యాయవాదులు చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలు లేకుండా న్యాయవాదుల నియామకాలు జరిగాయని వారు వివరించారు.విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి నియామకాలు జరపాలన్న అంశంపై ప్రధాన న్యాయమూర్తి కూడా అంగీకరించారన్నారు. ఈ విషయం పై కేంద్ర న్యాయ శాఖా మంత్రితో చర్చిస్తామని జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌ చెప్పారన్నారు. తెలంగాణా న్యాయవాదులు నిరసనను విరమించుకుంటేనే తాను జోక్యం చేసుకుంటానని, లేని పక్షంలో తప్పడు సంకేతాలు వేళ్లే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి సూచించారని తెలంగాణా న్యాయవాదులు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి సూచనపై హైదరాబాద్‌లో విస్తృత స్ధాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణా న్యాయవాద సంఘాల ప్రతినిధులు చెప్పారు.