ఆంధ్రవారితో కాదు..  వలసాంధ్ర నాయకులతోనే మా పంచాయితీ


– తెలంగాణ ప్రజలపై తెలంగాణ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి
– గతంలో రైతుకడుపు ఎండితే.. మా హయాంలో రైతుకడుపు నిండింది
– తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో
– మెదక్‌లో 10 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయం
– ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు
మెదక్‌,అ క్టోబర్‌29(జ‌నంసాక్షి) : మా కొడవ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రా ప్రజలతో కాదని.. ఆంధ్రా నుంచి వచ్చి మనపై పెత్తనం చేసే నాయకులపైనేనని ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం మెదక్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు కళ్ల సిద్ధాంతం, కన్నుకొట్టే సిద్ధాంతాలు కాదు… కంటికి రెప్పలా కాపాడుకునే వారు తెలంగాణకు కావాలన్నారు. తెలంగాణ ప్రజలపై తెలంగాణ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని, కానీ, ఎల్‌.రమణ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబు ముందు చేతులు
కట్టుకుని నిలబడటం తెలంగాణ ప్రజలను బాధించిందన్నానరు. తెలుగు ఆత్మగౌరవం కోసం పుట్టిన టీడీపీ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఢిల్లీకి తాకట్టుపెడుతోందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ కు ఓటు వేస్తే అభివృద్ధి పరంపర కొనసాగుతుందని హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్‌ఎస్‌ మానిఫెస్టో అని స్పష్టం చేసిన హరీష్‌రావు, టీడీపీ, కాంగ్రెస్‌ లకు తెలంగాణ, ఏపీల్లో వేర్వేరు ప్రయోజనాలున్నాయని అన్నారు. ఆనాడు కిరణ్‌ కుమార్‌ తెలంగాణకు రూపాయి ఇవ్వనంటే కాంగ్రెస్‌ నాయకులు ఒక్కరు మాట్లాడలేదని,  బానిస మనస్తత్వంతో కాంగ్రెస్‌ చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమవుతోందని ఆగ్రహంవ్యక్తం చేశారు. 90శాతం పూర్తయిన కాళేశ్వరంను కాంగ్రెస్‌ ఎందుకు నిలపేస్తుందని హరీష్‌రావు ప్రశ్నించారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చిన రైతుసమన్వయ సమితులను ఎందుకు రద్దు చేస్తారని ప్రశ్నించారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం ఆపేస్తామని, రైతుబంధు, కళ్యాణలక్ష్మీ పథకాలను ఆపేస్తామంటున్నారన్నారని అన్నారు. అన్నింటినీ వద్దు వద్దంటున్న కాంగ్రెస్‌ ను ప్రజలు వద్దనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి మెదక్‌ లో మొత్తం 10 సీట్లను గెలిచి కేసీఆర్‌ కు కానుకగా ఇస్తామని హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రైతు కడుపు ఎండిందని, టీఆర్‌ఎస్‌ హయాంలో రైతు కడుపు నిండిందని హరీష్‌రావు పేర్కొన్నారు.