ఆంధ్రాకు ఓ న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా?

రైతన్న ఆరుగాలం శ్రమించి అందరికి అన్నం పెట్టే త్యాగమూర్తి. అనేక ఆటుపోట్లు.. ఒడిదుడుకులు.. కష్టనష్టాలు ఓర్చుకొని ఏరువాక సాగించే రైతన్నలను ఆదుకోవడంలో, వారికి రాయితీలు ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదినుంచి సీమాంధ్ర పెత్తందారుల ఆధిపత్యమే కొనసాగుతోంది. నీరు పల్లమెరుగు అన్నట్లు సర్కారు పెద్దలు అన్ని సందర్భాల్లోనూ తమ వారిగా చెప్పుకునే సీమాంధ్రులకే అన్నింటా ప్రాధాన్యమిస్తున్నారు. వారి స్వార్థం ఎంతవరకూ వెళ్లిందంటే ప్రకృతి వైపరీత్యాలు సంబవించి సీమాంధ్ర ప్రాంతంలో పంటలకు నష్ట వాటిల్లితే ఒకలాగా, తెలంగాణ రైతులు నష్టపోతే మరోలాగా ప్రవర్తిస్తున్నారు. తుపాను దాటికి కొస్తాంధ్ర ప్రాంతంలో పంటలకు నష్టం వాటిల్లితే ఎవరు పాలకులుగా ఉన్న అన్ని పనులు విడిచిపెట్టి ప్రత్యేక హెలీక్యాప్టర్ల ద్వారా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అదే తెలంగాణలో తీవ్ర వర్షాభావం, కరువుతో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినా కన్నెత్తి కూడా చూడరు. అకాల వర్షాలు ముంచెత్తి చేతికందే దశలో పంటలను తుడిచిపెట్టినా కనీసం పట్టించుకోరు. ప్రభుత్వానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రే కాదు మంత్రలు, అధికారయంత్రాంగం అందరూ తెలంగాణ రైతాంగంపై వివక్ష చూపుతూనే ఉంటారు. ఇందుకు ఆధారాలు కోకొల్లలు. నీలం తుపాను దాటికి కోస్తాంధ్ర జిల్లాలు కాకవికలం అయిన మాట వాస్తవం. రైతులు సర్వస్వం కోల్పోయారన్నది నూటికి నూరుపాల్లు నిజం. కానీ వారిపై మాత్రమే సర్కారు ప్రేమ కురిపిస్తోంది. హుటాహుటిన వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కో హెక్టారుకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే రైతులకు హామీ మేరకు పరిహారం పంపిణీ చేశారు కూడా. అదే తెలంగాణ జిల్లాల్లో నెలరోజుల క్రితం అకాల వర్షాలు పెను నష్టాన్ని మిగిల్చాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, మొక్కజొన్న, చెరకు, పసుపు రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రైతుకూ పరిహారం అందలేదు. అంతకుముందు వరుసగా రెండేళ్లు కరువుతో పంటలు నష్టపోయినా ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఎన్నో నిబంధనలు పెట్టి కొందరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి మొత్తం తెలంగాణకే పరిహారం ఇస్తున్నట్లు చెప్పుకున్నారు. నీలం తుపాను బాధితులకు అండగా నిలిచిన సర్కారు నెలరోజుల క్రితం ఉత్తర తెలంగాణలోని పంటలను తుడిచిపెట్టిన అకాల వర్షాలను మాత్రం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కేవలం రెండు గంటలు పర్యటించి ఒక్క హామీ కూడా ఇవ్వకుండా, కనీసం రైతులనూ పరామర్శించకుండా వెళ్లిపోయారు. సర్కారు పట్టించుకోని తెలంగాణ రైతులపై మళ్లీ ప్రకృతి పగబట్టింది. మూడు రోజుల క్రితం సాయంత్రం వరకూ ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. చల్లగాలి స్థానే ఈదురుగాలి హోరెత్తించింది. దీనికి వడగళ్లు తోడయ్యాయి. ఫలితం వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో రైతన్నకు కోలుకోలేని దెబ్బ. నెల రోజుల క్రితం కొద్దోగొప్పో మిగిలిన పంటలను గాలివాన మొత్తంగా తుడిచిపెట్టేసింది. రైతులు బిక్కచచ్చిపోయారు. ఇంతవరకు వారిని ఓదార్చిన నాథుడు లేడు. మేమున్నాం అంటూ భరోసా ఇచ్చే వారు లేరు. దిగులు చెందకు ఆదుకుంటాం అని చెప్పే ఆధరువు లేదు. అంతకుముందు రోజు వరకు కొద్దోగొప్పో పంట చేతికి రాకపోతుందా అనే భరోసాలో ఉన్న రైతన్నలు బిక్కచచ్చిపోయారు. ఏలినవారి నుంచి ఆదరణ లేకపోవడంతో మరింతగా బెంగపడ్డారు. ఎన్నాళ్లో శ్రమించి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి పండించిన పంట భూమిపాలైతే.. ఆదుకునే హస్తం కానరాకుంటే వారు ఏం కావాలి. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా తమ వారికి నష్టం వాటిల్లితే విలవిల్లాడిపోయే పాలకులు ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ రైతుల నష్టాన్ని నష్టంగా ఎందుకు చూడదు. వారికి ఎందుకు భరోసా ఇవ్వదు. మేం ఆదుకుంటామని ఎందుకు వెన్నుదన్నుగా నిలవదు. ఇలాంటి రాష్ట్రంలో తామెందుకు కలిసి ఉండాలని కన్నీళ్లు నిండిన కళ్లతో ఇప్పుడు ప్రతి రైతన్న ప్రశ్నిస్తున్నాడు. వారికి సమాధానం చెప్పాల్సింది సీమాంధ్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు.