ఆంధ్రాది వితండవాదన

4

– మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):కృష్ణా నది జలాల్లో తెలంగాణ, ఏపీ న్యాయబద్ధంగా వాటాలు ఉపయోగించుకోవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు అభిప్రాయపడ్డారు. ఎవరికీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. నదుల అనుసంధానంపై ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ భేటి తర్వాత.. ఆ శాఖ కార్యదర్శి అమర్‌ జిత్‌ సింగ్‌ సమక్షంలో ఏపీ మంత్రి దేవినేని ఉమతో హరీష్‌ సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.నదుల అనుసంధానంపై ఐదో సమావేశం ఇవాళ జరిగిందని, ఎన్‌.డబ్ల్యు.డి.ఎ నిబంధనల మార్పును ఇవాళ్టి విూటింగ్‌ లో ఆమోదించారని చెప్పారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని 99 ప్రాజెక్టులకు నాబార్డ్‌ నుంచి రుణాలు తీసుకునేలా నిబంధనలు మార్చామన్నారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా నదుల అనుసంధానం జరగదని కేంద్ర మంత్రి ఉమా భారతి చెప్పారని హరీష్‌ రావు వెల్లడించారు.గోదావరి జలాల పంపిణీ 1981లో ఉన్న నీటి లభ్యత ఆధారంగా చేశారని, మారిన పరిస్థితుల నేపథ్యంలో మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయిస్తామని కేంద్ర మంత్రి హావిూ ఇచ్చారని, అందులో తెలంగాణ ప్రతినిధులను కూడా అనుమతించాలని కోరామన్నారు. గోదావరి నీటి లభ్యత అంచనా వేసిన తర్వాత నదుల అనుసంధానానికి తమకు అభ్యంతరం లేదన్నారు. గోదావరిపై ఈ 35 ఏళ్లలో పైన చాలా ప్రాజెక్టులు కట్టారని, వర్షపాతం, నీటి లభ్యత తగ్గిందని వివరించారు. సమైక్య పాలనలో అన్యాయానికి గురైన గోదావరి బేసిన్‌ లోని ఉత్తర తెలంగాణలో 40 లక్షల ఎకరాలు సాగులోకి తేవాల్సి ఉందని మంత్రి హరీష్‌ రావు చెప్పారు.కృష్ణా బోర్డు సమావేశంలో ఏపీ వితండ వాదనలతో విచిత్ర వైఖరి ప్రదర్శిస్తోందని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. ఏదీ తేల్చకుండా స్పష్టత ఇవ్వకుండా పేచీ పెడుతోందన్నారు. తమ అధికారులు రెండు రోజులుగా సహనంతో వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు.ఏపీ మంత్రి దేవినేని ఉమతో సాయంత్రం జరిగిన భేటి అసమగ్రంగా, అసంపూర్తిగా ముగిసిందని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. కృష్ణా నదిలో వాటాలు తేల్చే అధికారం రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డుకు లేదని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ తెలంగాణ నిర్వహించాలి, శ్రీశైలం ఏపీ నిర్వహించాలన్నది కృష్ణా బోర్డు సూచన మాత్రమేనని అన్నారు. కృష్ణా బోర్డు పని కేవలం నియంత్రించడమేనని, ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం కృష్ణా బోర్డు నడుచుకోవాలని విభజన చట్టం చెబుతోందని మంత్రి గుర్తుచేశారు. నాగార్జున సాగర్‌ కుడి కాల్వను వారికి ఇచ్చేయాలని ఏపీ వాదిస్తోందని, ప్రపంచంలో ఎక్కడైనా ఇలా ఉందా అని ప్రశ్నించారు. ఇది వితండవాదం కాక మరేంటన్నారు.పోలవరంలో 45 టీఎంసీలు తెలంగాణకు వస్తాయని ట్రిబ్యునల్‌ కేటాయింపులు చెబుతున్నాయని, అదే ఇవ్వాలని తాము అడుగుతున్నామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. పట్టిసీమ పోలవరంలో భాగం కాదని రాజ్యసభలో వాళ్లే చెప్పారని, అందులోనూ తమకు వాటా వస్తుందన్నారు. వాళ్లకు మూడో పంటకు నీళ్ళు కావాలి, కానీ మాకు ఒక పంటకు కూడా నీళ్ళు వద్దా అని నిలదీశారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ త్వరగా కేటాయింపులు జరపాలని తాము ఒత్తిడి చేస్తున్నామన్నారు. 299+90 టీఎంసీలు తమకు ఇవ్వాలని అడుగుతున్నామని చెప్పారు.

మహారాష్ట్ర, కర్ణాటకతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. ఏపీ వితండ వాదన వీడటం లేదని, అందుకే సఖ్యత లేదన్నారు. ఏపీ గత ఏడాది 512 టీఎంసీలు అప్పటికే వాడుకున్నా, డెల్టాలో మూడో పంట ఎండిపోతుంది అంటే అదనంగా 15 టీఎంసీలు ఇచ్చామని గుర్తుచేశారు. ఈసారి తీవ్ర కరవు ఉండటం వల్ల 811 టీఎంసీలు రావాల్సిన కృష్ణా బేసిన్లో 198 టీఎంసీలు మాత్రమే వచ్చాయని వివరించారు. దీన్ని సాకుగా చూపి రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. తాత్కాలిక సర్దుబాటు కేటాయింపులు కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే, కృష్ణా విూద ఉన్న అన్ని ప్రాజెక్టులు దాని పరిధిలోకి రావాలని అంటున్నామని, ఏపీ ఎందుకు వద్దు అంటోందని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుంచి అన్యాయమే చేస్తోందని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. హైకోర్టు విభజనలో జాప్యం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. రాత్రికి రాత్రే ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేశారని, సీలేరు ప్రాజెక్టుని వాళ్లకే అప్పగించారని వివరించారు. తాము చాలా ఓపికగా, సంయమనంతో వ్యవహరిస్తున్నామని అన్నారు. ట్రిబ్యునల్‌ కేటాయింపులు త్వరగా జరిపి, బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే ఎవరికీ ఏ గొడవా ఉండదన్నారు.రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలది విచిత్ర వైఖరి అన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టులో 3 గ్రామాలు మునగకుండా ప్రత్యామ్నాయం చేశామని, వెయ్యి కోట్లు ప్రజాధనం వృధా కాకుండా కాపాడామని చెప్పారు. అప్పుడు ప్రతిపక్షాలు మూడు గ్రామాలు ముంచాలి అని ధర్నాలు చేశాయని గుర్తుచేశారు. వాటిని ముంచకుండా ఎక్కువ నీళ్ళు ఇస్తామని చెప్పినా వినలేదన్నారు.30 గ్రామాలు మునగకుండా 6 గ్రామాల ముంపుతో పాలమూరు ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేస్తే గోల చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో 7 మండలాలను ముంచినా టీడీపీ ఏం మాట్లాడలేదన్నారు. ఇప్పుడు 6 గ్రామాలు, 3 గ్రామాల విషయంలో పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులకు సీపీఎం బెంగాల్‌ లో ఎంత ఇచ్చింది, టీడీపీ ఏపీలో ఎంత ఇస్తున్నదని మంత్రి ప్రశ్నించారు.టెండర్‌ కూడా పిలవని మల్లన్న సాగర్‌ లో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం విడ్డూరమని మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యంత పారదర్శకంగా జరుగుతున్న మిషన్‌ కాకతీయలో కూడా అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. 600 కోట్ల ప్రజాధన0 మిషన్‌ కాకతీయలో ఆదా చేశామన్నారు.మల్లన్న సాగర్‌ నిర్వాసిత రైతులతో చర్చిస్తామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. రైతులు ఎలా కోరుకుంటే అలా పరిహారం చెల్లిస్తామని అన్నారు. 4 వేల గ్రామాలకు అన్యాయం చేస్తూ, రైతుల ఉసురు పోసుకుంటూ, ఆత్మహత్యలు చేసుకునేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.