ఆకస్మిక వరదల వల్లే ప్రమాదాలు రైల్వేబోర్టు చైర్మన్‌ ఏకే మిట్టల్‌

aanjyb7oన్యూఢిల్లీ, ఆగస్టు 5 : రాత్రిరాత్రికి ఆకస్మికంగా వచ్చిన వరదల వల్లే ప్రమాదాలు జరిగాయని రైల్వే బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ వివరించారు. ప్రమాదానికి పది నిమిషాల ముందు కూడా కల్వర్టు వద్ద ట్రాకులపై కొన్ని రైళ్లు సురక్షితంగా ప్రయాణించాయని ఆయన తెలిపారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే పశ్చిమ మధ్య జోన్‌ జనరల్‌ మేనేజర్‌, బోపాల్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ అక్కడకు చేరుకున్నట్లు మిట్టల్‌ చెప్పారు. ఉన్నతాధికారులు ఇద్దరూ సహాయక కార్యక్రమాలు స్వయంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు.
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అక్కడికి మెడికల్‌ వ్యాన్‌, సహాయక రైళ్లను పంపించినట్లు మిట్టల్‌ వెల్లడించారు. కామాయాని, జనతా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని ప్రయాణికులను ఇటార్సీకి తరలించామని, అక్కడి నుంచి వారణాసి, ముంబైలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని ఏకే మిట్టల్‌ చెప్పారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కల్వర్టు మీద ట్రాక్‌ కుంగిపోయిందని, నేల చిత్తడిగా మారడంతో ట్రాక్‌ దెబ్బతిని బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే పీఆర్‌వో అనిల్‌ సక్సేనా వివరించారు. మొదట మాచక్‌ నది మీదున్న బ్రిడ్జ్‌పై ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని, కాగా నది దాటాక కొద్దిదూరంలో ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
కామాయాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు, మరో ట్రాక్‌ మీద వస్తున్న జనతాఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌, నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. కల్వర్ట్‌ మీద రెండు వైపులా నీరు ఉప్పొంగడంతో బోగీల్లోకి నీరు చేరాయన్నారు. సమాచారం అందిన వెంటనే తమ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అనిల్‌ తెలిపారు.
ప్రమాదం జరిగిన బోగీల్లో ప్రయాణికులను చాలా మందిని రక్షించి ఇతర బోగీల్లోకి మార్చామన్నారు. రెండు రైళ్లలోనూ బాగానే ఉన్న బోగీలను ఇటార్సీకి తరలించి ప్రయాణికులకు అక్కడ సౌకార్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై రైల్వేమంత్రి నిరంతరాయంగా పర్యవేక్షిసున్నట్లు రైల్వే పీఆర్‌వో అనిల్‌ సక్సేనా వెల్లడించారు.