ఆక్వా రైతులను ఆదుకుంటాం

– వారికి అన్నివిధంగా అండగా నిలుస్తాం
– వైసీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి
– చెరువులో వల వేసి, లాగిన వైఎస్‌ జగన్‌
– తమ సమస్యలను జగన్‌ వద్ద ఏకరవు పెట్టిన స్థానికులు
గుంటూరు, మే25(జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే అక్వా రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో సాగింది.. 171వరోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌.. పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించారు. రొయ్యల చెరువులో చేపలు, రొయ్యలకు మేత వేసిన స్వయంగా జననేత వైఎస్‌ జగన్‌.. వల వేయడంతో చేపలు, రొయ్యలు పట్టడం ఎలాగో వారిని అడిగి తెలుసుకున్నారు. రొయ్యలు, చేపల ధరలు ఎందుకు పడిపోతున్నాయో రైతులు ప్రతిపక్షనేతకు వివరించారు. తమను దళారులు ఏవిధంగా దోచుకుంటున్నది ఆక్వా రైతులు వైఎస్‌ జగన్‌కు వివరించారు. వ్యాపారులు సిండికేట్‌ అయ్యి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఈ సిండికేట్‌లో ప్రధాన భాగస్వామి అధికార పార్టీకి చెందిన నేత చింతమనేని ప్రభాకర్‌ అని వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. జననేత వారికి ధైర్యం చెప్పి, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోల్డ్‌ స్టోరేజ్‌ లు ఏర్పాటు చేస్తామని.. రైతులు గిట్టుబాటు ధర వచ్చేవరకు తమ పంటను కోల్డ్‌ స్టోరేజ్‌ లో దాచుకోవచ్చని చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తామని హావిూ ఇచ్చారు.  రైతు రుణ మాఫీ జరగలేదని పెదకాపవరం వద్ద కటారి కనక దుర్గ అనే మహిళ వైఎస్‌ జగన్‌ను కలుసుకుని.. తమ బాధ వివరించారు. లక్ష రూపాయల పంట రుణం తీసుకుని ప్రతి ఏటా వడ్డీ చెలిస్తన్నామని జగన్‌కి ఆ కుటుంబం వివరించింది. వైఎస్సార్‌ ప్రభుత్వంలో రుణ మాఫీ అయ్యిందని.. ఈ ప్రభుత్వంలో అసలు మాఫీ ఊసేలేదని వాపోయారు.