ఆగని లావా!
– కిలౌయిలో నిప్పులు కక్కుతున్న అగ్నిపర్వతం
– వందేళ్లలో ఇదే అతి పెద్ద భారీ విస్పోటనం
పహోవా, హవాయి , మే26(జనం సాక్షి) : ఈ నెల మూడున హవాయి ద్వీపంలోని కిలౌయిలో అగ్ని పర్వతం బద్దలయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకూ అంటే దాదాపు నాలుగు వారాలుగా లావా వెలువడుతూనే ఉన్నది. కిలౌయి అగ్ని పర్వతం నుంచి బయటకు వస్తున్న లావాతో హవాయి వీధులన్నీ పూర్తిగా కప్పబడ్డాయి. చాలా నివాస గృహాలు నాశనం అయ్యాయి. స్థానికులు ఆ ప్రదేశాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. బిగ్ ఐలాండ్‌లో ఉన్న లీలాని ఎస్టేట్స్ హౌసింగ్ డెవలప్‌మెంట్‌కు సవిూపాన ఉన్న ఈ కిలౌయి అగ్నిపర్వతం విస్పోటనం చెందడంతో విధ్వంసకర రీతిలో లావా వెలువడుతుండటంతో ఈ ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ నెల 3న విస్పోటమయిన ఈ అగ్నిపర్వతం వల్ల నాశనమయిన ఇళ్ల సంఖ్య తొలుత 50 కాగా ప్రమాద తీవ్రత పెరగడం వల్ల ఇది 80కు చేరుకుందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక దాదాపు 890 హెక్టార్ల(2,200) విస్తీర్ణం మేర లావా వ్యాపించిందని తెలిపింది. గత వంద సంవత్సరాలలో ఇదే అతి పెద్ద భారీ విస్పోటనమని, నష్టం కూడా పెద్ద మొత్తంలో వాటిల్లిందని ప్రకటించింది. దాదాపు 37 ఇళ్ల చుట్టూ లావా పేరుకుపోయింది. ఆ ఇళ్లలో ఇంకా ఎవరైనా ఉంటే వారు బయటకు రావడానికి వీలులేకుండా దాదాపు 30 విూటర్ల ఎత్తు వరకు లావా వ్యాపించిందని తెలిపింది.మొత్తం అగ్ని పర్వతంలో ఉన్న లావాలో, ప్రస్తుతం బయటకు వస్తున్నది చాలా కొద్దిశాతమేనని, ఈ కొద్ది మొత్తానికే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మొత్తం లావా బయటకు ప్రవహిస్తే పరిస్థితిని ఊహించలేమని అమెరికా జియలాజికల్ డిపార్టుమెంటు ఆందోళన వ్యక్తం చేసింది. ఇకైక అనే వ్యక్తి ఈ అగ్ని పర్వత విస్పోటనాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దానిలో అతను ‘అగ్నిపర్వతం నుంచి వెలువడిని లావా ఈ దారిలో ఉన్న 8 ఇళ్లను కేవలం 12 గంటల్లో నామరూపాలు లేకుండా చేసింది . ఇక్కడే మా సోదరుని ఇళ్లు కూడా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంతగా మారిపోయింద’న్నాడు.