ఆగని లావా!
అగ్విపర్వతం బద్దలైన ఘటనలో 99కి చేరిన మృతులు
200మంది ఆచూకీ గల్లంతు
భారీ వర్షంతో నిలిచిన సహాయక చర్యలు
మరోసారి బద్దలయ్యే ప్రమాదముందన్న అధికారులు
గ్వాటెమాలా, జూన్7(జనం సాక్షి) : మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలోని ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో మృతుల సంఖ్య 99కి పెరిగింది. ఇప్పటివరకు 99 మంది మృతదేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీసినట్లు గ్వాటెమాలా అధికారులు తెలిపారు. మరో 200 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కాగా.. అగ్నిపర్వతం మరోసారి బద్దలయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అగ్నిపర్వతం నుంచి లావా ప్రవాహం తగ్గకపోవడంతో పాటు భారీ వర్షం కురుస్తుండటంతో సహయకచర్యలు నిలిపివేశారు.ధ్య అమెరికాలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఫ్యూగో ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బద్దలైన ఈ అగ్నిపర్వతం గత ఆదివారం మరోసారి బద్దలైంది. దీంతో పెద్ద ఎత్తున లావా వెదచిమ్ముతోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద సముద్రమట్టానికి 12,346 అడుగుల ఎత్తు వరకూ ఎగిసిపడింది. అయితే ఫ్యూగో బద్దలైన సమయంలో దాని చుట్టుపక్క ప్రాంతాల్లో కొందరు పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. దీంతో వారంతా ఆ లావాలో చిక్కుకుని చనిపోయారు.ప్యూగో నుంచి వెలువడిన లావా నదిలా వేగంగా ప్రవహిస్తోంది. దీంతో వందల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. అనేక మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారమందుకున్న విపత్తు నిర్వహణ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అయితే లావా కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు దాదాపు 3వేల మందిని అగ్నిపర్వత పరిసర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.