ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు

రివర్స్‌ టెండరింగ్‌ కోసం ఏర్పాట్లు
కడప,నవంబర్‌9(జనం సాక్షి):  జిల్లాలో పట్టణ పేదలకు నివాస సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంగా గత ప్రభుత్వం జీ ప్లస్‌ 3 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఫేజ్‌-1 కింద కడప, ప్రొద్దుటూరు పట్టణాలను, ఫేజ్‌-2 కింద కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, జమ్మలమడుగు, రాజంపేట, పులివెందుల, ఎర్రగుంట్ల, బద్వేలు, ఫేజ్‌-3 కింద పులివెందుల, మైదుకూరు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలకు సై అంది. ఆ పట్టణాల్లో 19,197 ఇళ్లు కేటాయించింది. 2018 జనవరిలో ఏపీ టిడ్‌కో సంస్థ పర్యవేక్షణలో నిర్మాణాలు మొదలయ్యాయి. హైదరాబాదుకు చెందిన నాగార్జున కన్‌స్టక్షన్స్ర్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ నాలుగు శాతం ఎక్సెస్‌ ధరలకు పనులు చేపట్టింది. అగ్రిమెంటు ప్రకారం ఫేజ్‌-1 ఇళ్లను 2019 జనవరిలోగా పూర్తి చేసి సంక్రాంతికి గృహ ప్రవేశం కల్పించాలి. నెలలు గడిచిపోయినా ఇళ్లు పూర్తి కాలేదు. మే 30న కొలువుదీరిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 25 శాతం లోపు జరిగిన పనులను రద్దు చేసింది. అందులో భాగంగానే జీ ప్లస్‌ 3 ఇళ్లు కూడా ఆగిపోయాయి. తొలి విడతలో కడప నగరంలో 2092, ప్రొద్దుటూరులో 2 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రూ.229.52 కోట్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటివరకు 31.5 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. రూ.53.28 కోట్లు ఖర్చు చేశారు. కడప నగరంలో 992 ఇళ్లు ఫెన్సింగ్‌ లెవల్‌కు వచ్చాయి. జమ్మలమడుగులో ఫేజ్‌-2 కింద 1415 ఇళ్ల నిర్మాణాలు చేపడితే 71 శాతం పనులు పూర్తి చేశారు. అయితే గృహ ప్రవేశాలు చేసే స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. దీంతో పేదలకు ఇళ్లు కలగానే మారింది.  20 శాతం లోపే పనులు ఉండడంతో వీటిని రద్దు చేశారు. ఏపీ టిడ్కో జిల్లా అధికారులు రివర్స్‌ టెండరింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. త్వరలోనే రివర్స్‌ టెండరింగ్‌కు పిలిచే అవకాశం ఉంది. కొందరు పేదలు అప్పు చేసి వాటా ధనం చెల్లించారు. ఇంత వరకు ఇళ్లు మాత్రం కేటాయించలేదు. గత ప్రభుత్వంలో ఒకే వర్గానికి ఇళ్లు కేటాయించారని, వాటిని రద్దు చేసి లబ్దిదారులను మళ్లీ ఎంపిక చేస్తారనే ప్రచారం జోరుగా ఉండడంతో వాటా చెల్లించిన లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.