ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఓర్వకల్లు(జ‌నం సాక్షి): కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కర్నూలు-నంద్యాల ప్రధాన రహదారిపై ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 9మంది మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నాటువైద్యం కోసం వెళ్తూ..కర్నూలు జిల్లా కోడుమూరు మండలం చనుగొండ్ల, కలపారి గ్రామాలకు చెందిన పలువురు ఆదివారం తెల్లవారుజామున నాటువైద్యం కోసం మూడు ఆటోల్లో మహానంది బయలుదేరారు. వీరు సోమయాజులపల్లె వద్దకు చేరుకున్న సమయంలో రెండు ఆటోలు ముందు వెళ్లగా మూడో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో ఏడుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు ఆటో రాంగ్‌ రూట్‌లో రావడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ముందు వెళ్లిన రెండు ఆటోలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని.. లేదంటో మృతుల సంఖ్య భారీగా ఉండేదని తెలిపారు. మృతులంతా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులేనని… మహానందిలో నాటువైద్యం చేయించుకునేందుకు వెళ్తూ మృత్యువాత పడినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమాద సమాచారం తెలుసుకున్న మృతుల బంధువుల అక్కడికి భారీగా చేరుకున్నారు. తమవారు వైద్యం కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోవడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.