ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాల పరామర్శ

3

– కోదండరామ్‌ బస్సు యాత్ర ప్రారంభం

మెదక్‌,ఆగస్టు4(జనంసాక్షి):  పంటలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరామ్‌ పేర్కొన్నారు. సకాలంలో రుణాలు మాఫీ కాక  రైతులు ఆందోళనలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలో ఆత్మహత్యచేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రైతులను రుణ విముక్తులను చేయాలన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, బ్యాంకుల ద్వారా రుణాలు వెంటనే అందజేయాలన్నారు. ప్రకృతి వైఫరిత్యాల వల్ల ఎవరైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు.  మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం లింగరాజుపల్లి నుంచి రైతు ఐకాస బస్సు యాత్ర ప్రారంభమైంది. ఐకాస చైర్మన్‌ కోదండరామ్‌, ఐకాస నాయకులు లింగరాజుపల్లిలో పంటలను పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. రైతులు పంటలు కోల్పోయి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. రుణమాఫీని ప్రబుత్వం ప్రకటించాక రైతుల పక్షాన ప్రభుత్వం హావిూ ఇచ్చాక ఇక రైతులను బ్యాంకులను వేధించడం సరికాదని కోదండరామ్‌ అన్నారు. వ్యవసాయం కోసం అప్పులు చేసిన రైతులు ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.