ఆదిపరాశక్తి రూపమే అమ్మవారు

దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకతే వేరు
విజయవాడ,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   అణువుల నుంచి బ్రహ్మాండాల వరకూ వ్యాపించిన విశ్వరూపిణి, విజయ వినోదిని ఆదిపరాశక్తి. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అమ్మల రూపంలో సమస్త మానవాళిని పులకింపజేయడానికి ఆ జగజ్జననియే తరలి వస్తున్న శుభవేళయే దసరా శరన్నవరాత్రులు. ఆశ్వీయుజ మాసం తొలి రోజుల్లో జరిగే ఈ రెండు వేడుకల్లోనూ కోట్లాది మందితో ఆరాధనలు అందుకొనే దైవం ఒక
స్త్రీమూర్తి కావడం విశేషం. ఆమెనే సకల జగముల నేలే జగదాంబ. ప్రతీ ఒక్క మానవ మాత్రునికీ అత్యంత విశిష్ఠమని చెప్పాలి. అమ్మవారిని రోజూ నిష్టగా పుల రూపాల్లో పూజించడంతో పాటు నైవేద్యాలు సమర్పించి ఆరదాధించడం ఈ పండగ ప్రత్యేకత. వర్షఋతువు తర్వాత వచ్చే శరధృతువు అంటేనే వెన్నెల కాచే చల్లని సమయం. దేవీ నవరాత్రులను కూడా ప్రతీ హైందవ సమాజమూ అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటుంది. ఎందుకంటే,  దుర్గాదేవి , అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నా.. ఎవరో కాదు, ఆ ఆదిపరాశక్తే. నమ్మిన వారికి, దైవిక సిద్ధాంతాన్ని ఆచరించే వారికి ఆమె అనేక రూపాలలో దర్శనమిస్తుంది.  ఈ శక్తి కూడా అనేక రూపాలలో కనిపిస్తున్నది. అనంత విశ్వం మహాశక్తిపైనే ఆధారపడి ఉంది. భారతీయ ధర్మశాస్త్రాలు ప్రతీ స్త్రీమూర్తినీ శక్తికి ప్రతీకగా అభివర్ణించాయి. ఆ మాటకొస్తే అవి నారీమణులను పూజ్యనీయుల జాబితాలోకే చేర్చాయి.  త్రిమూర్తులను, త్రిమాతలను, ఇంకా మొత్తంగా దేవతల గణాన్నందరినీ సృష్టించింది ఆదిపరాశక్తియే. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆమెనే యావత్‌ సృష్టికి కర్త కర్మ క్రియ. కాబట్టి, సర్వశక్తులకూ కేంద్రస్థానం ఈ మహాశక్తి.  సృష్టికర్త, సంరక్షకురాలు, దుష్ట వినాశనకారి సర్వం ఆమెనే అని దేవీ భాగవత పురాణం పేర్కొన్నది. ఏడు సింహాలతో కూడిన రత్నాల సింహాసనంపైన ఆదిశక్తి కూర్చుని ఉండడాన్ని త్రిమూర్తులు చూసినట్లు అందులో ఉందని వేదపండితులు చెప్తారు. ఆదిబీజమే (ఆదిపరాశక్తి) తనంతట తాను పురుషుడుగా, ప్రకృతి (స్త్రీ)గా విభజితమైనట్లు అష్టాదశ పురాణాలలో ప్రధానమైన బ్రహ్మ పురాణం తెలిపింది. దేవీ భాగవతం ప్రకారం శక్తిలోని శకు ఐశ్వర్యమని, క్తికి పరాక్రమమని అర్థం చెప్పారు. సృష్టి ఆరంభంలో ఒక్క దేవి మాత్రమే ఉందని, ఆమెయే ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించిందని బహ్వృచోపనిషత్‌లోనూ కనిపిస్తుంది. ఆమె నుండే త్రిమూర్తులు, సర్వమూ ఉద్భవించినట్టు కూడా అందులో ఉంది. ఎప్పుడైతే భూమివిూద దానవత్వం పెరుగుతుందో అప్పుడు తాను అవతరించి దుష్టశిక్షణ జరుపుతానని జగజ్జనని అన్నట్టు దేవీసప్తశక్తి పేర్కొంటున్నది.  జగత్తులన్నింటికీ మూలమైన భగవంతుణ్ని సైతం సృష్టించింది భగవతి అయిన ఈ పరాశక్తియే. ఇంతేకాదు, ప్రతీ అణువణువులోని ప్రాణశక్తికి, ఆత్మయిక జీవుల్లో నిగూఢంగా ఉండే కుండలినీ శక్తులకూ, పరమాత్మలోని యోగ-మహామాయలకు.. అన్నింటికీ ఆదిమూలమూ ఆమెనే అని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. ఆ మహాశక్తి విశ్వరూపంలో మన దర్శనానికి అందింది అత్యల్పం. కాబట్టి, ప్రతి ఒక్కరూ అహాన్ని పక్కన పెట్టి శక్తి ఆరాధనకు సంసిద్ధులు కావాలి.శక్తి ఆరాధనను ఏదో ఒక మతానికో, వర్గానికో పరిమితం చేయనవసరం లేదు.  విశ్వంలో కనిపించని శక్తులూ ఇంకా శాస్త్రవేత్తల మేధకు, విజ్ఞాన శాస్త్రాలకు అందకుండానూ ఉన్నాయి. అవన్నీ మహావిశ్వంలో భాగమే అయినప్పుడు, మానవాళికి సర్వతోముఖాభివృద్ధికి అవన్నీ ఉపయోగపడుతున్నప్పుడు వాటిని శక్తి రూపంలో ఆరాధించడంలో తప్పులేదు.