ఆదిలాబాద్‌ కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంలో ఆంతర్యం?

లోటు వర్షపాతం ఉన్నా పట్టించుకోని అధికారులు

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రం వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారుల తప్పుడు నివేదికల వల్లనే ఆదిలాబాద్‌ జిల్లాకరువు ప్రాంతంగా ప్రకటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  గత మూడు సీజన్లలో కూడా పంట దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తున్నా… సాగు ఏసీజన్‌కు ఆసీజన్‌లో తగ్గు ముఖం పట్టినా కూడా అధికారుల కు మాత్రం ఎందుకు కళ్లు కనిపించలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 22 మండలాల్లో తీవ్ర వర్షాభావం  ఉందని అధికారుల లెక్కలు స్పష్టంగా చెపుతున్నాయి. వర్షాపాతం కూడా 20నుంచి 25శాతం వరకులోటు నమోదైంది. వర్షాభావ పరిస్థితులవల్ల బోర్లు, ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో వాటికింద పంటలు సాగు చేయలేకపోయారు. ప్రాజెక్టుల్లో కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం రబీ సాగైతే గణనీయంగా పడిపోయింది. వరి, కందులు, మొక్కజొన్న, పెసర, గోధుమ, శనగ, వేరుశనగ, పసుపు, పొద్దుతిరుగుడు, సజ్జ, రాగు వంటి పంటలు సాగు చేయాల్సి వచ్చింది. ఇదులో మొక్కజొన్న, కంది, గోదుమ, పసుపువంటి పంటలు మాత్రమే సాగయ్యాయి. రబీ సాగు సాదారణ సాగు విస్తీర్ణం లక్షా 20వేల హెక్టార్లు. 63వేల  189 హెక్టార్లలో సాగు చేసినట్లు అధికారులు చెపుతున్నారు. సాదారణ సాగు విస్తీర్ణం బట్టి చూస్తే 60శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. వరి మినహాయించి చిరు దాన్యాలు 21వేల 455 హెక్టార్లకు గాను 19వేల హెక్టార్లలోనే సాగయ్యాయి. గోదుమలు 3వేల 415 హెక్టార్లలలో సాగు కావాల్సి ఉండగా 1393 హెక్టార్లలో సాగు చేశారు. వాణిజ్య పంటలకు సంబందించి 18వేల17 హెక్టార్లలో సాగు చేయాలని అంచనావేయగా కేవలం 2వేల హెక్టార్లలోనే సాగు చేశారు. ఆహార పంటలకు సంబందించి 5వేల 898 హెక్టార్ల సాగుకు అంచనావేశారు. 2వేల 29 హెక్టార్లలో సాగు చేశారు. జిల్లాలో తీవ్ర వర్షాబావ పరిస్థితుల వల్ల రబీలో పంటల సాగు పడిపోగా వ్యవసాయాదికారులు మాత్రం 90శాతం పంటలు సాగు చేసినట్లుగా తప్పుడు నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో సాదారణ రబీ సాగు లక్షా 20వేల హెక్టార్లు. జిల్లావ్యవసాయాధికారులు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 71వేల 531 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. రబీసీజన్‌ ముగించేనాటికి ఫిబ్రవరి 23 నాటికి జిల్లాలో 63వేల 189 హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లుగా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అదికారులు వేసిన అంచనా బట్టి చూస్తే కేవలం 7వేల హెక్టార్లలోనే సాగు తక్కువగా అయింది. గతేడాది రబీసాగు చూస్తే 67వేల 564 హెక్టార్లలో నమోదైంది. గతేడాదితో పోల్చి చూస్తే 4వేల హెక్టార్లలో సాగు తగ్గింది. రబీలో సాదారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే సాగు కేవలం 60శాతం మాత్రమే పంటలు సాగు చేశారు. అధికారులు సాదారణ సాగు విస్తీర్ణాన్ని పట్టించుకోకుండా అంచనా మేరకు పోల్చి నివేదిక తయారు చేశారు. వ్యవసాయాదికారులు గతంలో ఖరీఫ్‌ పంటల సాగు, వర్షాభావం పంటల దిగుబడిలో తప్పుడు నివేదికలు పంపించడంతోనే జిల్లాను కరువు ప్రాంతంగా  ప్రకటించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో రైతులు, రైతు సంఘాల నాయకులు జిల్లాను కరువుగా ప్రకటించాలని ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. బడ్జెట్‌ సమావేశాలసందర్బంగానైనా జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరవు జిల్లాగా ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు, అధికార పార్టీ నేతలు అంటున్నారు. రబీలో కూడా 90శాతం సాగు చేసినట్లు వర్షాపాతం సాధారణంగా ఉన్నట్లు తప్పుడు నివేదికలు పంపించారు. దీంతో జిల్లాను కరువు జిల్లాల జాబితాలో చోటు దక్కలేదని తేలిపోయింది.తత్పలితంగా పంట నష్ట పరిహారం, ఉపాధిహామి పనిదినాల పెంపు, పశుగ్రాసానికి సబ్సీడి వచ్చేఅవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదం వల్ల నేడు జిల్లా రైతాంగం ప్రజలు అంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి న్యాయంచేయాలని కోరుతున్నారు.