ఆదుకుంటాం
సిరిసిల్లా టౌన్, న్యూస్‌లైన్: కిరణ్ సర్కారు విధానంలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల నేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. సర్‌చార్జీల భారంతో వేలల్లో వచ్చిన కరెంటు బిల్లు చెల్లించలేక మూడు రోజుల క్రితం సిరిసిల్లలో గుండె ఆగి చనిపోయిన అల్లె సత్తయ్య కుటుంబ సభ్యులను వారు శుక్రవారం పరామర్శించారు.
కరెంట్ కోతలు, సర్‌చార్జీల వాతలు, సమ్మెల నేపథ్యంలో వస్త్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేశారు. మరమగ్గాలను పరిశీలించి, వస్త్రోత్పత్తిదారులను, కార్మికులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నేతలు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా పవర్‌లూం పరిశ్రమ అనేక పమస్యలను ఎదుర్కొంటోందని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. వస్త్రపరిశ్రమపై ఇంధన వ్యయ సర్దుబాటు చార్జీ(ఎఫ్‌ఎస్‌ఏ)లను విధించడం సరికాదన్నారు.
నేతన్నల నెల సంపాదనకంటే కరెంట్ బిల్లులు మూడు నాలుగు రెట్లు వస్తున్నాయని, వాటికి ఏ విధంగా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓవైపు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ.. మరోవైపు అంతకు మించి ఎఫ్‌ఎస్‌ఏ విధిస్తున్న తీరు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకున్నట్టు ఉందని దుయ్యబట్టారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, నేతన్న సంక్షేమానికి ఎంతగానో పాటుపడ్డారని ఆయన గుర్తుచేశారు.టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధి, ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు రూ. లక్షన్నర ప్యాకేజీ, ప్రతి కుటుంబానికి అంత్యోదయ కార్డు, మహిళా సంఘాలకు సంపూర్ణ ఆర్థిక చేకూర్పు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని వివరించారు.
వైఎస్సార్ పథకాలన్నింటిని అమలు పర్చి నేతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని, టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేయాలని, ఎఫ్‌ఎస్‌ఏను ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ దయనీయ పరిస్థితిపై పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ చాలా బాధతో ఉన్నారని, ఇక్కడ నెలకొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయమన్నామని రామకృష్ణ వెల్లడించారు. వస్త్రోత్పత్తిదారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామి ఇచ్చారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్, కేకే. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్కారుకు రూ. లక్షల కోట్ల ఆదాయం వస్తున్న .. వ్యాట్, ఎఫ్‌ఎస్‌ఏ పేరిట భారం మోపడం శోచనీయమన్నారు. నేతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, తాము అండగా నిలుస్తామని అన్నారు. ఈ బృందం వెంట కేంద్ర పాలక మండలి సభ్యుడు ఆది శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ పుట్ట మధు, నాయకులు వాటికి సత్యంరెడ్డి, గాజుల బాలయ్య, బుస్సా వేణు, అక్కరాజు శ్రీనివాస్, జాలుగం ప్రవీణ్, ఇంతియాజ్, వరుణ్, రవిగౌడ్ తదితరులున్నారు.
విన్నపాలు..
వైఎస్సార్‌సీపీ బృందానికి వస్త్రోత్పత్తిదారులు, కార్మిరులు తమ సమస్యలను విన్నవించారు. ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు తగ్గించాలని, విద్యుత్ చార్జీలు తగ్గించాలని, సిరిసిల్లను టెక్స్‌టైల్ జోన్‌గా ప్రకటించాలని, కరెంట్ సబ్సిడీని పెంచాలని నాయకులు కొండ ప్రతాప్, పంతం రవి, మూషం రమేష్ వినతిపత్రం అందించారు.