ఆద్యంతం స్తబ్దుగా స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జులై11(జ‌నం సాక్షి) : క్రితం సెషన్‌లో జోరుగా సాగిన దేశీయ మార్కెట్లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో చతికిలపడ్డాయి. అమెరికా, చైనా మళ్లీ సుంకాల పెంపునకు నిర్ణయాలు తీసుకోవడంతో ప్రపంచ వాణిజ్య భయాలు రేకెత్తాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు డీలా పడ్డాయి. ఈ పరిణామాలపై దృష్టిపెట్టిన మదుపర్లు బుధవారం నేటి ట్రేడింగ్‌లో అప్రమత్తత పాటించారు. దీంతో ఆద్యంతం సూచీలు స్తబ్దుగా సాగాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 36,266 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా ఒకే ఒక్క పాయింట్‌ లాభపడి 10,948 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.82గా కొనసాగుతోంది.
రాణించిన టీసీఎస్‌..
తైమ్రాసిక ఫలితాల నేపథ్యంలో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ షేర్లు రాణించాయి. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ కంపెనీ షేరు విలువ 5శాతానికి పైగా పెరిగింది. టీసీఎస్‌తో పాటు ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో, హిందుస్థాన్‌ యునిలివర్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడగా.. యూపీఎల్‌ లిమిటెడ్‌, కోల్‌ఇండియా, హిందాల్కో, వేదాంతా లిమిటెడ్‌, టాటామోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.
——————————