ఆనాటి సచిన్‌ నాటౌట్‌.. నేటికి నాకు పజిలే

– వీడ్కోలు సభలో ఐసీసీపై మండిపడ్డ పాక్‌ క్రికెటర్‌ అజ్మల్‌

కరాచీ, నవంబర్‌30(జ‌నంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్‌ వివాదాస్పద స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. నేషనల్‌ టీ 20 చాంపియన్‌ షిప్‌లో భాగంగా బుధవారం సెసైలాబాద్‌ తరపున అజ్మల్‌ చివరి క్రికెట్‌ మ్యాచ్‌ ఆడేశాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)పై అజ్మల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘ఇప్పుడు నాకు 40 ఏళ్లు. కాబట్టి నేను తప్పుకొని యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనుకుంటున్నాను. ఎంతో అసంతృప్తితో ఇప్పుడు రిటైరవుతున్నాను. ఇందుకు ప్రధాన కారణం ఐసీసీ. నా బౌలింగ్‌ శైలి సరిగా లేదంటూ నాపై పదే పదే నిషేధం విధిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా నేను ఐసీసీకి ఒక సవాలు విసురుతున్నాను. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న బౌలర్లకు ఒకసారి పరీక్ష నిర్వహించండి. అందులో ఎంతమంది ఫెయిల్‌ అవుతారో చూడండి. నాకు తెలిసి 90 శాతం మంది బౌలింగ్‌ సరిగా లేదని నేను కచ్చితంగా చెప్పగలను ‘అని అజ్మల్‌ విమర్శించాడు.

కాగా, దాదాపు ఆరేళ్ల క్రితం నాటి ఒక సంఘటనను అజ్మల్‌ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నాడు. ‘నా కెరీర్‌లో ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం ఉంది. 2011 ప్రపంచకప్‌ సెవిూ పెనైల్‌-2లో మేము భారత్‌తో తలపడ్డాం. ఆ మ్యాచ్‌లో సచిన్‌ 85 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 37వ ఓవర్లో నా బౌలింగ్‌లోనే సచిన్‌ అఫ్రిదికి క్యాచ్‌ ఇచ్చాడు. అంతకుముందే నా బౌలింగ్‌లో సచిన్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ అంపైర్‌ ఔటివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆనాటి సచిన్‌ నాటౌట్‌.. నేటికి నాకు పజిలే. సచిన్‌ వికెట్లు ముందు క్లియర్‌గా అవుటైనా ఫీల్డ్‌ అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ నాటౌట్‌ గా ప్రకటించారు. అయితే డీఆర్‌ఎస్‌లో సచిన్‌ అవుటైనట్లు కనబడింది. కాకపోతే ఆ సమయంలో ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే కట్టుబడి ఉండాల్సి రావడం వల్ల సచిన్‌ సేవ్‌ కావడంతో పాటు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు అని అజ్మల్‌ గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు.