ఆప్యాయంగా సేవలందిస్తున్న హెడ్ నర్స్ శంకర ‘అ’మ్మ
ఆమె అభిమానులుగా మారిన వందేళ్ల వృద్ధులు
– వైద్య సేవలకు ఫిదా అవుతున్నా రోగులు
చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 28) : సహజంగా సర్కార్ దవాఖానా అంటే రోగులు వెళ్లేందుకు ఇష్టపడరు. అక్కడి వైద్య సేవలపై వారికి నమ్మకం ఉండదు పైగా రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తారని విశ్వసిస్తారు . కానీ అందుకు భిన్నంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సేవలు రోగులను ఆకట్టుకుంటున్నాయి. ఆప్యాయతతో కూడిన వైద్యం రోగులకు ధైర్యాన్ని నింపి ఆరోగ్యం కుదుటపడేందుకు దోహదపడుతుంది. ఆస్పత్రి మొత్తంలో అతి తక్కువ సిబ్బందితో రోజుకు ఎంతో మంది రోగులకు సేవలు అందించడంలో గతం నుంచే ఆస్పత్రికి మంచి గుర్తింపు ఉంది. దాంతో చుట్టుపక్కల మండలాల నుంచి రోగులు అక్కడికి రావడం పరిపాటిగా మారింది.ఇదంతా చూస్తుంటే అక్కడి సేవలకు రోగులు ఏ స్థాయిలో ఫిదా అవుతున్నారో తెలుస్తుంది. రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యను అడిగి తెలుసుకునే హెడ్ నర్స్ శంకరమ్మ చిన్నా పెద్దా తన మన అనే బేధం లేకుండా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తుందని స్వయంగా రోగులే చెబుతున్నారు. వందేళ్ల వృద్ధుల కు సంబంధించిన నాలుగేళ్ల నాటి మందుల చీటీ శంకరమ్మ జాగ్రత్తగా తన సెల్ ఫోన్ లో భద్రపరిచి నాటి నుంచి నేటి వరకు ఆ వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడం కేవలం ఆమెతోనే సాధ్యం, ఆ వృద్ధులు కూడా ఆమె చెప్పినట్లు వింటూ నేటికీ చక్కటి ఆరోగ్యంగా ఉండడం వారు కూడా శంకరమ్మ సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటించడం ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యపోక మానరు. ఇంతలా సేవలందించే శంకరమ్మకు అప్పుడప్పుడు రోగుల పట్ల విపరీతమైన కోపం కూడా వస్తుంది. అదేంటి అంటారా…? తమ ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహించే వారికి చెడామడా అరుస్తూ అంతలోనే ఆప్యాయతను చాటుతుంది. ఇలాంటి వైద్య సిబ్బంది స్థానికంగా పని చెయ్యడం మండల ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారంటే అక్కడి సేవలు ఏ స్థాయిలో రోగులకు అందుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఇక గర్భవతులు చల్లటి కాన్పు కోసం స్థానిక ఆసుపత్రి నీ ఎంచుకోవడం అక్కడి వైద్య సేవల పై ఉన్న నమ్మకానికి అద్దం పడుతుంది. అంతేకాక కొద్దిపాటి ఖాళీ సమయం దొరికితే ఆసుపత్రిలోని తను ఎంతో ఇష్టంగా పెంచుకునే పూలమొక్కల వైపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రి ఆవరణ అంతా పచ్చటి పార్కును తలపించే ఆహ్లాదకర వాతావరణం ఆమె లోని పర్యావరణ ప్రేమికురాలని తట్టి చూపుతుంది. అయితే తన కష్టం వెనుక సిబ్బంది సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పడం ఆమె లోని గొప్పతనాన్ని చెప్పకనే తెలుస్తోంది. అతి తక్కువ సిబ్బందితో ఏమాత్రం విసుగించుకోకుండా వైద్య సేవలు అందించడం అనేది ఒక్క చండ్రుగొండ ప్రభుత్వ ఆస్పత్రి సొంతమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం విష జ్వరాలు ప్రబలే నేపధ్యంలో మరికొంత మంది సిబ్బంది స్థానిక ఆసుపత్రికి కేటాయిస్తే మరింత మంచి సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.