ఆమెకు రహస్యంగా అంతిమ’సంస్కారం’


న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) :

కామాంధుల అరాచకానికి బలైపోయిన ఆమెకు ప్రజలు కన్నీటి ధారలతో నివాళులర్పిస్తున్నారు. దేశ రాజధానిలో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ ఆదివారం కూడా ఆందోళనల పర్వం కొనసాగింది. ఉదయమే జంతర్‌మంతర్‌ వద్దకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థినులు చేరుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని, చట్టాలను కఠినతరం చేయాలని నినాదాలు చేశారు. ఇండియా గేట్‌ వైపునకు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నా రు. ఏబీవీపీ కార్యకర్తలు కూడా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. సీఆర్‌పీఫ్‌, రక్షణ బలగాలు భారీగా మొహరించాయి. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని 10 మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. విజయ్‌చౌక్‌, జన్‌పథ్‌, ఇండియాగేట్‌కు వెళ్లే మార్గాలను మూసివుంచారు. రాజధానిలో జరిగిన దురాగతాన్ని పసిగట్టలేని భద్రత వ్యవస్థ మధ్యలో బతుకున్నామనే విషయం తలుచుకుంటేనే ఒల్లు జలదరిస్తుందని విద్యా ర్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా పాలకులు నిమ్మకునీరెత్తనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మధ్యాహ్నం కొందరు బారికేడ్లు తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులను ఉరితీయాలని, మహిళా రక్షణ చట్టాలను కఠినతరం చేయాలని డిమాండు చేశారు. ఇదిలా ఉండగా పోలీసులు తమ ఆంక్షలను స్వల్పంగా సడలించారు. అయిదు మెట్ల్రో స్టేషన్లలో సర్వీసులు ప్రారంభ మయ్యాయి. రాకపోకలను ప్రారంభింపజేశారు. రాజీవ్‌ చౌక్‌, పటేల్‌ చౌక్‌, ప్రగతి మైదాన్‌, బార్‌కాంబ, మండీ స్టేషన్‌లలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే జనజీవనం

కుదుటపడుతోంది. పోలీసు భద్రత మాత్రం యథావిథిగా కొనసాగుతోంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటూ జన జీవనానికి అంతరాయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆమె మృతి పట్ల ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లోని ప్రజలు, మహిళలు నివాళులర్పి ంచారు. కొవ్వొత్తులతో శాంతి ర్యాలీలు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా…

ముంబయి : సినీ తారలు శాంతి ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలు, మాజీ సినీనడి జయాబచ్చన్‌ నివాళులర్పించారు. నటీమణులు హేమామాలిని, దీపికా పదుకునే తదితరులు నివాళులర్పించారు. ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌లో బాబా రామ్‌దేవ్‌ ఆమె మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. బెంగళూరులో విద్యార్థులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బాధితురాలి మృతికి సంతాపంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో యువత నిరసన ర్యాలీ నిర్వహించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీలో నటుడు కమల్‌ కామరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.