ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను తయారు చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 

-18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో ఉండాలి

-ప్రత్యేక శిబిరాల పై విస్తృత ప్రచారం చేయాలి

 

సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి , ఆగస్టు 24  :ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను రూపొందించాలని  జిల్లా  కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంగారెడ్డి నియోజకవర్గం ఏఈఆర్ఓ లు, అడిషనల్ ఏ ఈ ఆర్ ఓ లు, బిఎల్ఓ సూపర్వైజర్లు, బి ఎల్ వో లకు ఓటరు జాబితా రూపకల్పన, తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా జరిగేలా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా స్పష్టమైన ఓటరు జాబితా తయారు  చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా  నమోదు చేయించాలన్నారు. జెండర్ రేషియోను ప్రత్యేక శ్రద్ధతో వెరిఫై చేయాలన్నారు. 18 నుండి19 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నాలుగు శాతం ఉండాలని తెలిపారు.ఏఈఆర్వోలు, బిఎల్ఓ సూపర్వైజర్లు ప్రతి కళాశాలకు వెళ్లి ఎంతమంది ఓటరుగా నమోదయ్యారు, ఎవరు నమోదు కాలేదన్నది తెలుసుకొని అక్కడికక్కడే ఓటరు గా నమోదు చేయించాలని సూచించారు. ఫోటో సిమిలర్ ఎంట్రీస్ లో పొరపాటుగా తొలగించినట్లయితే వారి నుండి ఫారమ్ 6 తీసుకుని ఓటరు జాబితాలో చేర్చాలన్నారు.ఆరు మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న ఇండ్లను మరోసారి పరిశీలించాలని తెలిపారు. సెప్టెంబర్ 19 వరకు ప్రతి బిఎల్ఓ  ఫారం 6, ఫారం 8 ఎన్ని స్వీకరించారన్న సమాచారాన్ని ప్రతిరోజు నివేదిక నివ్వాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు.పోలింగ్ కేంద్రాల్లో నిర్ణీత సంఖ్య కన్నా ఓటర్లు పెరుగుతున్నట్లయితే కొత్త పోలింగ్ స్టేషన్కు ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు. ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండాలన్నారు.రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలేజీలు, కాలనీలకు వెళ్లి అర్హులందరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.అర్హులు ఏ ఒక్కరూ ఓటరు జాబితాలో తప్పి పొరాదన్నారు.ఆగస్టు 26, 27 సెప్టెంబర్ 2, 3 తేదీలలో ఓటరు నమోదు, మార్పులు చేర్పులకై ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నందున, బిఎల్ఓ లు వారి వారి పోలింగ్ కేంద్రాలలో ఓటరు జాబితా తో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఫారం 6,7, మరియు 8 లతో అందుబాటులో ఉండి, స్వీకరించాలన్నారు. ప్రత్యేక శిబిరాల గురించి గ్రామంలో ముందు రోజు టామ్ టామ్ చేయించాలని సూచించారు.ఓటరు జాబితా నుండి చనిపోయిన వారిని తొలగించాలనుకుంటే  ఫారమ్ -7 ద్వారా ఫిర్యాదు పొందిన తర్వాత విచారణ చేసి తొలగించాలన్నారు.   80 సంవత్సరాలు దాటిన వయవృద్ధులు, వికలాంగులు  తమ ఇంటి వద్ద నుండి ఓటు హక్కు వినియోగించకోవడానికి   ఎన్నికల కమిషన్ సదుపాయం కల్పించిందని తెలిపారు. వారి వివరాలను సేకరించాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ నగేష్, రెవిన్యూ డివిజనల్ అధికారులు , సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఏఈఆర్ఓ లు , అడిషనల్ ఏ ఈ ఆర్ ఓ లు, బి ఎల్ ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓ లు,  మున్సిపల్ కమిషనర్ సుజాత,తదితరులు పాల్గొన్నారు.