ఆరోపణలపై వివరణ ఇవ్వండి
విూ ఆరోపణలతో తితిదే ప్రతిష్ట దెబ్బతింటుంది
రమణదీక్షితులు, సాయిరెడ్డికి తితిదే నోటీసులు
మరికొందరికి నోటీసులు జారీచేసే అవకాశం
తిరుమల, జూన్13(జనం సాక్షి) : తితిదే పరువుకు భంగం కలిగించారంటూ వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులుకు తితిదే నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాలంలో తితిదేతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆభరణాలు సీఎం చంద్రబాబు ఇంట్లో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. రమణ దీక్షితులు సైతం చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో విూడియా సమవేశాలు ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించారు. వీటిపై తితిదే ధర్మకర్తల మండలి తీవ్రంగా స్పందించింది. దేవస్థానం పరువుకు భంగం కలిగిస్తున్న వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ఈ నేపథ్యంలో తితిదే నోటీసులు జారీ చేసింది. దేవస్థానం పరువుకు భంగం కలిగించిన విూపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని వారిద్దరిని తితిదే నోటీసుల్లో సంజాయిషీ కోరింది. గత నెల 15న చెన్నై వేదికగా రమణదీక్షితులు టీటీడీతో పాటు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయగా, కొద్దిరోజులకే ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. టీటీడీ పోటులో తవ్వకాలు జరిగాయని, నేలమాలిగలను తరలించి సీఎం నివాసంలో దాచారని ఆరోపించారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని తెలంగాణ పోలీసులు గానీ, సీబీఐ గానీ చంద్రబాబు ఇంటిపై దాడులు నిర్వహిస్తే నగలు బయట పడతాయంటూ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గత కొద్దిరోజులుగా తిరుమలలో జరుగుతున్న పరిణామాలు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఈనెల5న జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై కూలంకశంగా చర్చించి వీరిరువురికీ మొదటి దశగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి పోస్టు ద్వారా టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరికొంతమందికి కొద్దిరోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు టీటీడీ న్యాయవిభాగం అధికారులు చెబుతున్నారు.