ఆరో రోజు అదే తీరు

4

– కదలని బస్సులు

– సమస్య సీఎంకు నివేదిస్తాం

– మంత్రి వర్గ ఉపసంఘం

హైదరాబాద్‌,మే 11 (జనంసాక్షి):

తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి పలు డిపోల వద్ద ఆందోళన చేపట్టారు. సమ్మె విరమించాలన్న హైకోర్టు ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ సమ్మె కొనసాగించారు. మరోవైపు రెండు రాష్ట్రాల ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘాలు సమ్మె విరమణకు కృషి చేస్తున్నాయి. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక, ఒప్పంద సిబ్బందితో ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వరుసగాఆందోళన కారణంగా పట్టణాలు, గ్రామాల్లో బస్సులు లేక ప్రజలు నానాయాతన పడుతున్నారు. తెలంగాణలోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సాధ్యమైనన్ని బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి ఆరో రోజుకు చేరింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ బస్సులు ప్రయాణీకుల వద్దనుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు డిపోలకే పరిమితమవుతూ సకల జనుల సమ్మెను తలపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనలో పట్టినపట్టు వీడటంలేదు. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి పలు డిపోల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోనైతే ఉద్యోగులు, ప్రైవేట్‌ ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు  ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక, ఒప్పంద సిబ్బందితో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ఈమేరకు సోమవారం సీఎం కేసీఆర్‌తో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ కానుంది. కార్మికుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఏపీ సబ్‌కమిటీ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపనుంది.  వరంగల్‌ జిల్లాలో ఒప్పంద, తాత్కాలిక సిబ్బంది సాయంతో 200 బస్సులు నడుస్తున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్‌ డిపో ఎదుట కార్మికులు బైఠాయించి ఆందోళన చేశారు.ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మెలో భాగంగా జిల్లాలోని ఆర్టీసీ డీపోల వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు రో/-డడెక్కక పోవడంతో ప్రధాన మార్గాల్లో ప్రైవేటు వాహనదారులు సర్వీసులు నడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు 226 బస్సులు నడపనున్నట్లు ఆర్‌ఎం రవికుమార్‌ తెలిపారు. అనంతపురం జిల్లాలో సాయంత్రానికి 400 బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ బస్టాండ్‌ నుంచి దూర ప్రాంతాలకు సర్వీసులు నిలిచిపోయాయి. కడప జిల్లాలో సోమవారం కూడా కార్మికులు సమ్మె కొనసాగించారు.  పలుప్రాంతాల్లో ఆందోళనలు, ధర్నాలు, వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగొచ్చేదాక సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె కొనసాగుతున్నా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. 138 ఆర్టీసీ బస్సులు, 255 అద్దె బస్సులు నడిచాయి. ఆర్టీసీ ఆర్‌ఎం గోపినాథ్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీపీఎం విజయభాస్కర్‌ దగ్గరుండీ బస్సు సర్వీసులు నడిపించారు. కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, తదితర ప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులు నడిచాయి. సోమవారం  స్కూల్‌ అసిస్టెంట్‌ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఆర్‌ఎం గోపినాథ్‌రెడ్డి తెలిపారు. కొన్ని మండలాలకు రాత్రే బస్సులను పంపించామన్నారు. రాత పరీక్ష ముగిసిన తరువాత వారి వూళ్లకు వెళ్లేందుకు బస్సులు నడపనున్నట్లు చెప్పారు. డీఎస్సీ పరీక్షకు వచ్చే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఆర్టీసీని, కార్మికులను కాపాడుకుంటాం

ఆర్టీసీని కాపాడుకునేలా చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. రేపు ఆర్టీసీ కార్మిక నేతలతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. ఆర్టీసీ పై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో అధికారులతో చర్చించిన తర్వాత మిగతా మంత్రులతో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఇప్పటికే రూ. 1700 కోట్ల నష్టంలో ఉందని, సమ్మె చేస్తే మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆర్టీసీని, కార్మికులను కాపాడుకుంటామని నాయిని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపామని, పూర్తి వివరాలు సీఎం కేసీఆర్‌ కు నివేదిస్తామని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి కార్మిక నేతలతో మాట్లాడతారని, కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

ఆర్టీసీ సమ్మె నివారణపై చర్చించండి: సిఎం కెసిఆర్‌ ఆదేశం

ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెపై  సీఎం కె. చంద్రశేఖర్‌రావు సచివాలయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి సమ్మె ఉపసంహరణకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించాలని సూచించారు. సమ్మె విషయంలో సంస్థ ఆర్థిక స్థితిగతులు, కార్మికుల సంక్షేమం, ప్రభుత్వ పరిమితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సబ్‌ కమిటీ సభ్యులను ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించే ఆర్టీసీని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీ స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ మనుగడ కూడా చాలా ముఖ్యమన్నారు. మంత్రివర్గ ఉపసంఘం, రవాణాశాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవే అంశాలను చర్చించారు.  ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం సవిూక్షించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలతో ఆదివారం జరిపిన చర్చల సారాంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి నివేదించింది. కార్మికుల ప్రధాన డిమాండైన 43 శాతం ఫిట్‌మెంట్‌పైనే సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో కేబినేట్‌ సబ్‌కమిటీ సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, మంత్రి తలసాని, సిఎస్‌ రాజీవ్‌ శర్మ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.