రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం
` రెండు నెలల్లో తిరిగి సొరంగం పనులు ప్రారంభిస్తాం
` ప్రమాదం జరిగిన చోట రాజకీయాలు చేయాలని చూస్తారా?
` ఎస్‌ఎల్‌బీసి వద్దకు వచ్చేందుకు హరీశ్ ప్రయత్నంపై మంత్రి ఉత్తమ్ మండిపాటు
` జగన్‌తో అంటకాగి నీటి చౌర్యానికి సహకరించిన బిఆర్‌ఎస్
` వేగంగా కొనసాగుతున్న బురద తొలగింపు చర్యలు
` ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఇంకా వీడని ఉత్కంఠ
మహబూబ్‌నగర్(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు రెండ్రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండు నెలల్లో తిరిగి సొరంగం తవ్వకం పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.టన్నెల్ కూలిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమేనని ఉత్తమ్ ఆరోపించారు.’’గత ప్రభుత్వం టన్నెల్‌లో నీటి తొలగింపు పనులు కూడా చేపట్టలేదు. టన్నెల్‌లో నీటిని తోడివేసి ఉంటే.. ఇప్పుడీ ప్రమాదం జరిగేది కాదు. గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టును పక్కకు పెట్టారు. టన్నెల్ పూర్తి చేసి ఉంటే 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి. భారాస చేపట్టిన ప్రాజెక్టులన్నీ వాళ్ల జేబులు నింపుకొనేందుకే. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే అది మూడేళ్లకే కూలింది. గతంలో శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు చనిపోతే కనీసం వెళ్లి చూడలేదు. పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోతే స్పందించలేదు.కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే.. నాడు కేసీఆర్ వెళ్లలేదు. కేసీఆర్ ఫామ్‌హౌస్ దగ్గర్లోనే మాసాయిపేట రైలు ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదు. ప్రమాదం జరిగిన చోట రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారు. హరీశ్‌రావుకు అనుభవం ఉంటే పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు. నిపుణుల చర్యలకు ఇబ్బంది కావొద్దని అందరినీ లోపలికి పంపట్లేదు. టీబీఎం వెనుక ఉన్న బురద తొలగింపు పనులు జరుగుతున్నాయి. బురద తొలగింపు పూర్తికాగానే మిషన్ శిథిలాలు తొలగిస్తాం’’ అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.పదేళ్లపాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉందని.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ అనుమతుల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఆప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఎందని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్‌రావు మాటలు పూర్తి అబద్దాలు, గొబెల్స్ ప్రచారమేనని విమర్శించారు. ఎస్‌ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీలు గ్రావిటీ ద్వారా వస్తుంటే బీఆర్‌ఎస్ నేతలె పనులు వదిలిపెట్టి వెళ్లారని చెప్పారు. వాళ్లు సరైన పని చేసి ఉంటే తెలంగాణలో 30 టీఎంసీలు నీళ్లు వచ్చి మూడు నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు సాగులోకి వచ్చేవని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదాన్ని అందరికీ చూడటానికి అనుమతిస్తున్నామని చెప్పారు. వారి హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న తమకు ఎలాంటి అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాళ్ల హయాంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చుపెట్టి నామమాత్రపు పనులు చేశారని మండిపడ్డారు. వాళ్ల హయాంలో నీటిపారుదుల శాఖను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావులకు దక్కుతుందని చెప్పారు. తాము ప్రజాస్వామ్యతంగా పారదర్శకంగా ముందుకు పోతున్నామని చెప్పారు. వాళ్లు శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బ్లాస్ట్ జరిగి.. 9 మంది చనిపోతే ఒక్కరూ కూడా ఎందుకు పరామర్శకు రాలేదని ప్రశ్నించారు. ఆరోజు రేవంత్ రెడ్డి వస్తుంటే కారులో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని గుర్తుచేశారు. దేవాదులలో ఏడు మంది చనిపోతే.. ఆస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయని చెప్పారు. అప్పుడు హరీష్ రావు ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడావా అని నిలదీశారు. ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేరన్నారు. ఇక్కడికి వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విూరు జగన్‌తో కుమ్మక్కై ప్రగతిభవన్‌లో విందులు, వినోదాలు చేసుకుంటుంటే జగన్ కృష్ణానదిని దోచుకువెళ్లారని విమర్శించారు.. పాలమూరు రంగారెడ్డిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రూ. 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నీరందించలేదని ధ్వజమెత్తారు. ఎస్‌ఎల్‌బీసీకి కరెంట్ కట్ చేస్తే డీ ఓటరింగ్ చేయలేక పనులు ఆగిపోయాయని చెప్పారు. అప్పుడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఏమి చేశారని ప్రశ్నించారు. తనకు హెలికాప్టర్‌లో తిరగాలని తనకు ఏ మాత్రం లేదని..తాను గతంలో పైలట్‌ను అని గుర్తుచేశారు. భారతదేశంలో టన్నెల్ ప్రమాదాల్లో అత్యంత నిపుణులను కలిగిన 11 ఏజెన్సీలను తీసుకువచ్చి సమర్థవంతంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు చెప్పిన మాటలు అబద్దాలు అని.. ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.
వేగంగా కొనసాగుతున్న బురద తొలగింపు చర్యలు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో పేరుకుపోయిన బురదను తొలగించే ప్రక్రియ షురూ అయింది. గురువారం నాడు సహాయక చర్యల్లో భాగంగా ఒక వైపు డీ వాటరింగ్ చేస్తూ, మరో వైపు బురదను లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకువస్తున్నారు. టీబిఏం మిషన్ సమీపంలో పడి ఉన్న సామాగ్రిని కూడా తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే తప్ప సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బురద తొలగించే పనులను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్‌లు పర్యవేక్షిస్తున్నారు. సొరంగం నుంచి పెద్ద ఎత్తున బురద బయటకు తీస్తున్నారు. లోకో ట్రైన్ వెళ్లి రావడానికి గంట సమయం పడుతుంది. పెద్ద ఎత్తున కూలీలను ఉపయోగించి.. లోపల హిట్యాచి ద్వారా బురదను బయటికి తకలిస్తున్నారు. భారీ యంత్రం సహాయంతో వీటిని తీసి టిప్పర్‌లలో తరలిస్తున్నారు. ఈరోజు మొత్తం ఇదే కార్యక్రమం సాగుతుందని.. బురద తీసాక పరిస్థితిని అంచనా వేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం ఎలా అనేదానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెబుతున్నారు. ఒక వైపు బురద తొలగిస్తూనే మరో వైపు టీబిఏం మిషన్‌ను చిన్న చిన్న బాగాలుగా కట్ చేస్తున్నారు. ఈ భాగాలను కూడా వేరుచేసి బయటకు తీస్తున్నారు. ముందుగా రెండుకిలోమీటర్ల వద్ద బురదను క్లియర్ చేస్తున్నారు.