దక్షిణాదికి అన్యాయం జరగదు

` 2026 ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవుతుంది: అమిత్‌షా
కోయంబత్తూర్‌(జనంసాక్షి):కేంద్రం తీసుకునే ఏ నిర్ణయంలోనైనా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రమంత్రి అమిత్‌ షా భరోసా ఇచ్చారు జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు` కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని పేర్కొన్నారు. అటువంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని ఆయన అక్కడి ప్రజలను కోరారు.అధికార డీఎంకే ప్రభుత్వంపై ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. 2026 ఎన్నికల్లో దేశ వ్యతిరేక పార్టీ అయిన డీఎంకే ఓటమి పాలవుతుందని.. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 భాజపాకు చారిత్రాత్మక ఏడాదిగా నిలిచిందని షా అన్నారు. అదే ఏడాది నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా ఎన్నికయ్యారని.. చాలా ఏళ్ల తర్వాత అంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హరియాణా, దిల్లీ ప్రజలు భాజపాపై విశ్వాసంతో తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తూ.. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్వి భాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందిస్తూ…’తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదు’ అని స్పష్టం చేశారు. దీనిపై తమిళనాడు నేతలకు, కేంద్రానికి మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోన్న వేళ తమిళ భాషను కీర్తిస్తూ అమిత్‌ షా ప్రసంగించడం గమనార్హం.