ఆర్టీసీలో సమ్మె సైరన్‌

` హామీల అమలుకు జెఎసి సమ్మె నోటీసు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్‌సీల అమలు, సీసీఎస్‌, పీఎఫ్‌ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లింపు తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని నోటీసుల్లో పేర్కొన్నారు. ‘ మేనిఫెస్టోలోని అంశాలను ప్రభుత్వం అమలు చేయాలి. ఎలక్టిక్ర్‌ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ట్రేడ్‌ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించడం లేదు. యూనియన్లు రద్దు చేసి, కార్మికులకు పనిగంటలు పెంచారు.‘ అని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్‌ భవన్‌ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నప్పటికీ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని సంఘాల నేతలు మండిపడ్డారు. ఇలానే నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఐదేండ్ల తర్వాత సమ్మె చేయడం ఇదే తొలిసారి అని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రయివేటుపరం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అదే కనుక జరిగితే.. వేలాది మంది ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రతిపాదనను మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్‌ భవన్‌ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.