ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు

– ఆర్టీసీ స్థలాలను వాణిజ్యపరంగా వినియోగంలోకి తెస్తాం
– రూ. 200 కోట్లతో 850 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నాం
– పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఆర్టీసీకి భారం పెరిగింది
– విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు
విజయవాడ, మే25(జ‌నంసాక్షి) : ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అదనపు సిబ్బందిని నియమించి సెలవుల్లో ఇబ్బందులు తొలగించామన్నారు. అలాగే 20,200 మంది పెన్షన్లు పెండింగ్‌లో ఉన్నట్టు గుర్తించామని, పాత బకాయిలు చెల్లించే పనిలో ఉన్నామన్నారు. జూన్‌లో పదవీ విరమణ చేసే వారికి అదే రోజున బెనిఫిట్స్‌ ఇస్తామని, చార్జి మెమోలతో వేధించే పద్ధతి ఇకపై ఉండదని, రద్దీకి అనుగుణంగా బస్సుల వేళలను మార్చడం వల్ల.. ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిందని ఎండీ తెలిపారు. పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఆర్టీసీకి భారంగా మారాయని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఆర్టీసీకి నష్టాలు వస్తున్నా సామాజిక బాధ్యతతో గ్రావిూణ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామన్నారు. డిమాండ్‌ ఉన్న రోజుల్లో టికెట్ల ధరలు పెంచాలని యోచిస్తున్నామని, ఇతర మార్గాల ద్వారా రూ. వెయ్యి కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని ఎండీ తెలిపారు. అలాగే ఆర్టీసీ స్థలాలను వాణిజ్యపరంగా వినియోగంలోకి తెస్తామని, రూ.200 కోట్లతో 850 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నామని సురేంద్రబాబు పేర్కొన్నారు.