ఆర్టీసీ కార్మికుల మృతికి కేసీఆరే కారణం
– బంగారు తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారింది
– బీజేపీ నేత బాబుమోహన్
సంగారెడ్డి, నవంబర్14 (జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నాడని, కార్మికుల మరణాలకు కేసీఆరే బాధ్యత వహించాలని బీజేపీ నేత, మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వ తీరుకు మనస్తాపం చెంది మృతి చెందిన నారాయణఖేడ్ డిపో కండక్టర్ నాగేశ్వేర్ మృత దేహాన్ని సందర్శించి బాబుమోహన్ నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ నియంతపాలన కొనసాగుతుందని విమర్శించారు. త్వరలో తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు కేసీఆర్ నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడుతారన్నారు. కేసీఆర్ కలలు గన్న బంగారు తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారిపోయిందన్నారు. ఈ దమనకాండకు సీఏం కేసీఆరే బాధ్యులన్నారు. ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వేర్ కుటుంబానికి బీజేపీ అండగా నిలిచి ఆదుకుంటుందని బాబుమోహన్ హావిూఇచ్చారు. భూమి పుట్టినప్పటి నుండి కేసీఆర్ లాంటి పాలకులు వచ్చి ఉండరన్నారు. ప్రజలు ఏర్పరచిన ప్రభుత్వంలో ఆ ప్రజలే ప్రాణ త్యాగాలకు గురైతే అడిగే వారు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వారి ఉసురు తెలంగాణ ప్రభుత్వానికి తగలక మానదని ఆయన అన్నారు. అహంకార పూరితంగా వ్యవహరించకుండా కార్మికులను చర్చలకు పిలవాలని బాబుమోహన్ సూచించారు.


