ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర
తక్షణం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి: కాంగ్రెస్
కరీంనగర్,నవంబర్25( జనంసాక్షి): కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. లాభాల్లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని సోమవారం నాడిక్కడ అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగుందని, ప్రభుత్వ ఆస్తులను విక్రయించే యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతామన్నా ఎందుకు తీసుకోవడం లేదన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం మూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని మృత్యుంజయం విమర్శించారు. అందరూ బాగుండాలని తెలంగాణ తెచ్చుకుంటే.. రాష్టాన్న్రి తాకట్టు పెట్టే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయం, రహదారుల అభివృద్ధి విస్మరించారని, దీనిపై ఆ రెండు శాఖల మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హైకోర్టు చెరో మెట్టు దిగమని ప్రభుత్వానికి, కార్మికులకు చెప్పిందని, ఆ మేరకు కార్మికులు విధుల్లో చేరుతామని చేసిన ప్రకటనను ఎందుకు పరిగణించరని అన్నారు. అలాగే కార్మికుల లక్ష్యాలు కూడా తర్వాతి రోజుల్లో నెరవేరుతాయని అశాభావం వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికులకు ఎళ్లవేళలా కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీకి ఉందని, కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల పట్ల కార్మికులు ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.