ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి

పోస్ట్‌ కార్డు ఉద్యమం ద్వారా మద్దతు

విజయవాడ,నవంబర్‌25 (జనంసాక్షి) : తెలంగాణ ఆర్‌టిసి కార్మికుల సమస్యలపై స్పందించాలని డిమాండ్‌

చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వేలాది పోస్టుకార్డులతో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు ఎపిఎస్‌ఆర్‌టిసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కె జిలానీబాషా, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ సుందరయ్య తెలిపారు. తెలంగాణ కార్మికులకు సంఘీభావంగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యాన విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ సమ్మె చేసి విరమించిన టిఎస్‌ ఆర్‌టిసికి కార్మికులను ఏ షరతులూ లేకుండా తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, షెడ్యూళ్లన్నిటినీ ఆర్‌టిసియే నడపాలని అన్నారు. కార్మికుల బాధలను అర్థం చేసుకుని, వారితో యాజమాన్యం, ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు, ప్రజా సంఘాలు ఆర్‌టిసి కార్మికులకు అండగా నిలవాలని, పోస్టు కార్డు ఉద్యమంలో అందరూ భాగస్వాములై ‘కె.చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి, ప్రగతిభవన్‌, హైదరాబాద్‌’ చిరునామాకు పోస్టుకార్డులు పంపాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేకి కెసిఆర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పెట్టుబడిదారులకు కెసిఆర్‌ కొమ్ముకాస్తున్నారని, అందుకే కార్మికులను విస్మరిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇప్పటికే ఎంతోమంది కార్మికులు మృతి చెందారని, ఆర్‌టిసిని సొంత సంస్థగా భావిస్తూ పనిచేస్తున్న కార్మికుల పొట్టకొట్టడం అన్యాయమని తెలిపారు. ఇప్పటికైనా కెసిఆర్‌ మొండివైఖరిని వీడి టిఎస్‌ఆర్‌టిసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.