ఆర్మీ ఎంపిక కోసం నిరుద్యోగుల పోటీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): సైనిక ఉద్యోగాల కోసం యువత పోటీ పడుతున్నారు. వరంగల్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న నియామక ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి యువకులు ఉత్సాహాంగా తరలివస్తున్నారు. అయితే, అభ్యర్థులకు సరైన వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హన్మకొండలోని జవహార్‌లాల్‌ నెహ్రూ మైదానంలో ఈ నెల 22న సైనిక ఉద్యోగాలకు ఎంపిక మొదలైంది. 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అన్ని విభాగాలలో కలిసి సుమారు 1000 ఉద్యోగాలుండగా, 40,000 మంది పోటీ పడుతున్నారు. అధికారులు సరైన వసతులు ఏర్పాటు చేయక పోవడంతో అభ్యర్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజుకు 3 నుంచి 4000 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు తమకు సరైన వసతులు కల్పించలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎండాకాలం కావడంతో మరింతగా ఇబ్బందులు తప్పడం లేదు.