ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు మంచి నిర్ణయమే
స్వాగతించిన అంతర్జాతీయ ద్రవ్యనిధి
వాషింగ్టన్, జూన్8(జనం సాక్షి) : కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా(ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) స్వాగతించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచడం సరైనదేనని ఐఎంఎఫ్ పేర్కొంది. ‘రెపో రేటును 25 బేసస్ పాయింట్లు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. ద్రవ్యోల్బణం, చమురు ధరలు పెరుగుతుండటం, ఇతర దేశీయ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ వేసిన అడుగు సరైనదే అని ఐఎంఎఫ్ భావిస్తోంది’ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికార ప్రతినిధి గెర్రీ రైస్ అన్నారు. ఇటీవల జరిగిన పరపతి విధాన కమిటీ ద్వైమాసిక సమావేశంలో కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 6శాతం నుంచి 6.25శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం నాలుగున్నరేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా 2014 జనవరిలో రెపోరేటును 8శాతానికి పెంచింది. ఆ తర్వాత రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా ఉంచుతూ వచ్చింది. ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటమే రేట్ల పెంపునకు కారణమని ఆర్‌బీఐ తెలిపింది.