ఆలయాల్లో క్షురకుల ఆందోళన

ప్రముఖ దేవాలయాల్లో మూతబడ్డ కేశఖండన శాలలు
ఇబ్బందులు పడుతున్న భక్తులు..
అధికారుల తీరుపై మండిపాటు
విజయవాడ, జూన్‌15(జ‌నం సాక్షి ) : ఆంధప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో క్షురకులు మెరుపు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ధర్నా చేశారు. వీరి ఆందోళనతో దేవాలయాల్లో కేశ ఖండన శాలలు మూతపడ్డాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ దుర్గగుడి కేశఖండనశాలలో క్షురకులు విధులు బహిష్కరించారు. రెండు వారాల క్రితం పాలకమండలి సభ్యులు పెంచలయ్య క్షురకునిపై దాడి చేశారు. దాడి విషయంలో పెంచలయ్య పై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పు పడుతూ క్షురకులు ఆందోళన చేస్తున్నారు. దాడి తర్వాత పాలకమండలి చైర్మెన్‌ గౌరంగబాబు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇచ్చిన హావిూ నెరవేర్చకపోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని క్షురకులు కోరుతున్నా అధికారుల నుంచి స్పందన లేదు. దీంతో దుర్గగుడి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. శ్రీశైల దేవస్థానం కల్యాణకట్టలో పనిచేసే క్షురకులు తమ డిమాండ్లను పరిశీలించాలంటూ విధులు బహిష్కరించారు. 150 మంది క్షురకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర దేవాలయాల నాయిబ్రహ్మణ సంఘ ఐకాస పిలుపు మేరకు క్షురకులు కల్యాణకట్ట వద్ద బైటాయించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత 30 ఏళ్ల నుంచి కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని, న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు క్షురకుల నిరసనతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం కేశఖండన శాలలో క్షురకులు ఆందోళన చేపట్టారు. దీంతో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు తరలివచ్చిన వేలాదిమంది భక్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. ఎంతో నమ్మకంతో భక్తిభావంతో తరలివచ్చిన భక్తులు తలనీలాలు తీసేవారు లేక పెనుగంచిపోలు గ్రామంలోని బార్బర్‌ షాపులకు వెళ్లారు. భక్తులంతా ఒక్కసారిగా పోటెత్తడంతో షాపులన్నీ కిక్కిరిసిపోయాయి. దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోటంతో అధికారుల తీరుపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల సంఘీభావం..
పేదోళ్ల మనోభావాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, బలహీనవర్గాల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్‌ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కె. పార్థసారధి విమర్శించారు. కనీస వేతనాల కోసం విజయవాడ దుర్గగుడిలో ఆందోళన చేస్తున్న క్షురకులకు పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాలకు మంచి ఆదాయం ఉన్నా క్షురకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ప్రభుత్వ పెద్దలను కలిసి అభ్యర్థించినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇది ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం రూ.17 వేలు ఇవ్వాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య డిమాండ్‌ చేశారు. గత మూడు రోజుల నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం లేకుండా ఎలా జీవించాలని ప్రశ్నించారు. సాయంత్రంలోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
చంద్రబాబు సర్కారు దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.