ఆలయ భూములపై స్పష్టత లేని అధికారులు
అన్యాక్రాంత భూములపై పట్టించుకోని వైనం
వరంగల్,సెప్టెంబర్26(జనంసాక్షి): జిల్లా పరిధిలో అనేక మండలాల్లో వివిధ కేటగిరీలకు చెందిన 90 ఆలయాలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగానే విధులను నిర్వహిస్తున్నామని, జిల్లాల వారీగా విభజన కాలేదని దేవాదాయశాఖ ఉద్యోగులు అంటున్నారు.
ఆలయాల భూములు మాత్రం అంతగా ఆక్రమణకు గురికాలేదని, రైతులు కౌలు కింద సాగు చేసుకుని ఏడాది వారీగా ఆలయాలకు డబ్బులు చెల్లిస్తున్నట్లు చెపుతున్నారు. కొన్ని ఆలయాల పరిధిలో ఉన్న
భూములు కోర్టు కేసుల్లో మగ్గుతుండగా, మిగిలిన భూములు ఆయా దేవాలయాల పరిధిలో సాగు జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆలయ భూములను కూడా పూర్తి స్థాయిలో సర్వే చేస్తామని గతంలో ప్రకటించినా దానిపై వివరాలు మాత్రం తెలియడం లేదు. దేవాలయ భూముల సర్వే నంబర్ల ప్రకారం భూములను పరిశీలిస్తాం. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గ్రా మాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతీ సర్వే నంబర్‌కు సంబంధించిన భూ విస్తరణను 1బీ ఆధారంగా చూసి, ఎవరి పేర ఎంత ఉందనే విషయాన్ని గుర్తిస్తామని గతంలో తెలిపారు. దేవాలయాల భూములు చాలా గ్రామాల్లో ఉన్నాయి. వాటి వివరాలను సేకరించి 1బీ తయారు చేసి కంప్యూటరీకరిస్తామని అన్నారు. అయితే ఎక్కడా అలా చేశారా లేదా, చేస్తే ఎంత భూమి ఉందన్న విషయం తెలియపరిచే
వివరాలు అందడం లేదు. బచ్చన్నపేట చెన్నకేశవ ఆలయానికి చినరామంచర్ల, బచ్చన్నపేట, గురువన్నపేట, గౌరాయపెల్లి గ్రామాల్లో దాదాపు వంద ఎకరాల వరకు భూమి ఉంది. దీనివిలువ ప్రస్తుత మార్కెట్లో రెండుమూడు కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూములను రికార్డుల్లో సరిచేసి ఉంటే ఆలయాలఅఉ దీనస్థితిలో ఉండా/-లసిన ఆగత్యం ఉండేది కాదు. బచ్చన్నపేట చెన్నకేశవ ఆలయం, శంభుదేవుని ఆలయం, ఇటిక్యాలపల్లి రామాలయం, చిలుపూర్ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయం పరిధిలో వందల ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా నష్కల్ పరిధిలో ఉన్న శ్రీసీతారామస్వామి ఆలయ పరిధిలో 80 ఎకరాలు ఉండగా 20 ఎకరాల భూమి గౌడ కులస్తులు కాస్తు చేస్తుండగా, మిగిలిన 60 ఎకరాల భూమిని గ్రామ నిరుపేదలు కాస్తు చేసుకుని జీవిస్తున్నారు. ఇది కూడా నామమాత్రంగా శిస్తు చెల్లించి రైతులు సేద్యం చేసుకుంటున్నారు. పాలకుర్తి దేవాలయ పరిధిలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిధిలో 8ఎకరాలు, వల్మిడి సీతారామ చంద్రస్వామి ఆలయ భూములు 53 ఎకరాలు ఉండగా ఇందులో 30 ఎకరాలు కోర్టు కేసు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లింగాలఘనపురం జీడికల్ సీతారామస్వామి దేవుడి పరిధిలో 120 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు చూపుతున్నాయి. నవాబుపేట్ కోదండరామస్వామి ఆలయ పరిధిలో 20ఎకరాలు ఉండగా అది అత్యంత విలువైనది. అంతేకాకుండా కొడవటూరు దేవాలయంతో పాటు జనగామ జిల్లా పరిధిలో 90 దేవాలయాలు ఉండగా, ఆలయాల పరిధిలో 1627 ఎకరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.