ఆశారాం కేసులో తీర్పిచ్చిన న్యాయమూర్తి బదిలీ

– ఉత్తర్వులు జారీ చేసిన రాజస్థాన్‌ హైకోర్టు
– భద్రతకారణా దృష్ట్యా బదిలీ!
జోధ్‌పూర్‌, మే3(జ‌నం సాక్షి): తనను తాను అవతార పురుషుడిగా ప్రకటించుకుని ఆధ్యాత్మిక గురువుగా చలామణీ అయిన ఆశారాం బాపు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తీర్పు వెలువరించిన జోధ్‌పూర్‌ న్యాయమూర్తి మధుసూదన్‌ శర్మను బదిలీ చేశారు. ప్రస్తుతం జోధ్‌పూర్‌ కోర్టులో ఎస్సీ/ఎస్టీ కేసుల విభాగాన్ని చూస్తున్న ఆయనను భద్రతా కారణాల దృష్ట్యా బదిలీ చేశారు. జైపూర్‌లోని న్యాయ సంబంధ వ్యవహారాల శాఖ సంయుక్త సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు రాజస్థాన్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో ఐదుగురు న్యాయశాఖ అధికారులనూ బదిలీ చేస్తున్నట్లు రెండు వేరు వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం మైనర్‌ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాంకు జోధ్‌పూర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 25న తీర్పునిచ్చింది. బాపూను పోక్సో చట్టం పరిధిలోకి రాకుండా ఆయన అనుచరులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించారు. తీర్పునకు ముందు బాధితురాలి పుట్టిన తేదీ మార్చేందుకూ ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ విఫలం కావడంతో ఆయనకు శిక్ష పడింది. తన వంటి జ్ఞానులు మైనర్లపై అత్యాచారం చేయడం సబబే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆశారాం… ఈకేసులో తనకు మరో ఉన్నత న్యాయస్థానం న్యాయం చేస్తుందంటూ ఆశారాం ధీమా వ్యక్తం చేస్తున్నారు.