ఆశాలకు మద్దతుగా సిఐటియూ ఆందోళన

విశాఖపట్టణం,అక్టోబర్‌5 (జనంసాక్షి):  దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఆశాలకు నెలవారీ జీతాలను ఇస్తున్నారని, మన రాష్ట్రంలోని ఆశాలకు అసలు జీతమే ఇవ్వట్లేదని సిఐటియూ నాయకులు విమర్శించారు
ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపడతామని అన్నారు. ఆశా కార్యకర్తలకు నెలవారీ జీతాలను ప్రకటించాలని ఆందోళనలు చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఆశాలకు కేరళలో రూ.7,500, మన పక్కనే ఉన్న తెలంగాణాలో రూ.ఆరు వేలు ఇస్తున్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా కార్యకర్తలకు నెలవారీ జీతాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆశాలకు కొన్నేళ్లుగా యూనిఫారం, చీరలు ఇవ్వట్లేదన్నారు. వారికి ఇస్తున్న కొద్దిపాటి
పారితోషికాలు కూడా సక్రమంగా చెల్లించట్లేదన్నారు. టిఎ, డిఎలను సకాలంలో చెల్లించాలని కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆశాలకు కనీస గౌరవం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశాలకు నెలవారీ జీతం కనీసం రూ.ఆరు వేలను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద తొమ్మిదో తేదీన జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని ఆశా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.