ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి
కరీంనగర్ : ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా నిలిచిన ‘పొలిపాక గట్టయ్య’ అనారోగ్యంతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. కరీంనగర్‌నగర్ జిల్లా రామగుండం మండలం ఉట్నూర్ గ్రామానికి చెందిన పొడగరి గట్టయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గట్టయ్య గతకొంత కాలం నుంచి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో గట్టయ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గట్టయ్య మృతదేహాన్ని స్వగ్రామం ఉట్నూరుకు తరలించారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.
శిల్పారామంలో ఉద్యోగం..
గట్టయ్య ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలువురు సెలబ్రిటీలతో పాటు పిల్లలు, పెద్దలు కూడా గట్టయ్యతో కలిసి ఫొటో దిగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సినీనటులు కూడా ఫొటోలు తీయించుకున్నారు. ఏడున్నర అడుగుల ఎత్తు ఉండే కొలిపాక గట్టయ్య గట్టయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శిల్పారామంలో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఆయన కొన్ని రోజులుగా ఆస్తమాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వెళ్లి, తిరిగి హైదరాబాద్ వచ్చారు. గట్టయ్యకు తల్లి లక్ష్మి, అన్న చంద్రయ్య ఉన్నారు.