ఆసీస్‌ ప్రధాన కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ నియామకం

– నాలుగేళ్లపాటు కొనసాగనున్న లాంగర్‌
– ప్రకటించిన క్రికెట్‌ ఆస్టేల్రియా
మెల్‌బోర్న్‌, మే3(జ‌నం సాక్షి) : ఆసీస్‌ ప్రధాన కోచ్‌గా ఆదేశ మాజీ ఆటగాడు జస్టిన్‌ లాంగర్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్టేల్రియా బోర్డు ప్రకటించింది. బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా డారెన్‌ లీమన్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతని స్థానంలో లాంగర్‌కు సీఏ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం అతడు వెస్టన్ర్‌ ఆస్టేల్రియా, పెర్త్‌ స్కాచర్స్‌ జట్లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు.
నాలుగేళ్ల పాటు పురుషుల ఆస్టేల్రియా క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందించేందుకు జస్టిన్‌ లాంగర్‌కు ఎన్నుకున్నాం. ఈ నెల 22న ఆయన బాధ్యతలు చేపడతారు. ఆయన హయాంలో ఆసీస్‌ రెండు యాషెస్‌ సిరీస్‌లతో పాటు వన్డే, టీ20 ప్రపంచకప్‌లు ఆడనుంది’ అని సీఏ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా లాంగర్‌ మాట్లాడుతూ…’ఆస్టేల్రియా క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాలని ఎంతో ఆత్రుతగా ఉంది. కొన్ని సవాళ్లు ఎదుర్కొవాలి. ప్రతిభ గల ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ గర్వపడేలా పని చేస్తా’ అని అన్నాడు. 1993 నుంచి 2007 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన లాంగర్‌.. 105 టెస్టులాడాడు. 45.27 సగటున 7,696 పరుగులు సాధించాడు. ఇందులో 23 శతకాలు కూడా ఉన్నాయి.
—————————–