ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలువైద్య విధాన పరిషత్ కమిషనర్ రామా వెంకట్రావు
శ్రీకాకుళం, జూలై 17 : ఆసుపత్రుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామా వెంకట్రావు తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో అవసరం మేరకు వైద్య సిబ్బంది, వైద్యాధికారులను నియమించనున్నట్లు చెప్పారు. మందుల కొరత లేకుండా పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నందున త్వరలో పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కోటబొమ్మాళి ఆసుపత్రిలో పారిశుద్ధ్యం సరిగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి భవనాల మర్మతులు, విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. బారువ తదితర ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్న వైద్య పరికరాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని పలు ఆసుపత్రుల సమస్యలను జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా. సి.హెచ్. సుధాకర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ డా. ఎన్.పద్మావతి, డా. అరుణకుమారి, ఎస్.ఇందుసింహ, ఎ.పి.వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.