ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

గోదావరిఖని,జూలై23(జ‌నంసాక్షి): స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన, ఆస్పత్రిలోని సమస్యలను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాలతోపాటు వార్డుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి కొరత తీవ్రంగా ఉందని, ఏసీలు, పంకాలు పనిచేయడం లేదని పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి ఆవరణలో మురుగుకాల్వ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, పక్కనే ఉన్న ఉపరితల జలాశయం నుంచి నీటి సరఫరా చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆయన కోరారు. ఆయనతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.శ్రీనివాసరెడ్డితోపాటు, వైద్యులు, వైద్యసిబ్బంది, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.