ఆహ్లాదకరంగా ఆలయాల అభివృద్ది


బాసరలో అభివృద్ది పనుల పూర్తి
అధికారులతో సవిూక్షించిన మంత్రి ఇంద్రకరణ్‌
హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఆధ్మాత్మికతో పాటు మానసిక ఆహ్లాదం కలిగించేలా ఆలయాల పరిసరాలను తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బాసరలో ఆధ్యాత్మిక టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్టాల్ర నుంచి భక్తులు వస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ జిల్లాలోని ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులపై సోమవారం అరణ్య భవన్‌లో మంత్రి సవిూక్ష నిర్వహించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం, అడెల్లి పోచమ్మ, కాల్వ లక్ష్మినర్సింహా స్వామి, కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సవిూక్షలో చర్చించారు. వివిధ ఆలయాల్లో కొనసాగుతున్న పనులు, త్వరలో చేపట్టబోయే పనులకు సంబంధించి అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..ఎకో టూరిజానికి క్రమంగా పర్యాటకులు పెరుగుతు న్నప్పటికి టెంపుల్‌ టూరిజానికి కూడా భక్తులు అత్యధిక ప్రాధాన్యత ఇసున్నారన్నారు. ముఖ్యంగా భక్తులకు విడిది సౌకర్యం, క్యూ కాంప్లెక్స్‌, తాగునీరు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, తదితర సౌకర్యాలు, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించడంతో పాటు గోదావరి నదికి హరతీనిచ్చే ప్రాంతాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దడం, బోటింగ్‌ కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బాసరలో ఇప్పటికే రూ. 8 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, బాసరతో పాటు అడెల్లి, కాల్వ, కదిలి ఆలయాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ శిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అడెల్లి ఆలయ విస్తరణ పనులకు కావాల్సిన భూ సేకరణకు తగిన ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్‌కు అందజేయాలన్నారు. పుణ్యస్నానాలకు ప్రత్యేకంగా షవర్లు ఏర్పాటు చేయాలని, కోనేటిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా చూడాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అంతర్గత రోడ్ల విస్తరణ, పిల్లలకు ప్రత్యేక ఆట స్థలం, భక్తులకు విడిది గృహాలు, వీఐపీ గెస్ట్‌ రూంలు, బయో టాయ్లెట్స్‌ నిర్మించాలని సూచించారు. కాల్వ దేవస్థానంలో కోనేటిని అభివృద్ధి పరచడంతో పాటు భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల్లో భక్తులకు కల్పించే పలు సదుపాయాల కోసం దాతలు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు
రావాలని మంత్రి కోరారు. సవిూక్షలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, సత్పతి శ్రీవల్లినాయగం, సీఈజీ సీతారాములు, బాసర ఈవో వినోద్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.