ఆ నగరాల్లో పెట్రోల్, డీజిల్ రోజుకో రేటు

దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో రోజువారి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు.. డైనమిక్ ప్రైసింగ్ విధానం మే ఒకటి నుంచి అమలులోకి వచ్చిందని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్షయ్ బన్సాల్ ప్రకటించారు. దక్షిణ భారతంలోని పుదుచ్చేరి, వైజాగ్.. పశ్చిమంలో ఉదయ్ పూర్.. తూర్పున జంషెడ్పూర్.. ఉత్తర భారత దేశంలో చండీగఢ్ నగరాలలో పైలట్ ప్రాజెక్టుగా పెట్రోల్, డీజిల్ ధరలలో రోజువారి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ 30న మూడు చమురు కంపెనీలు.. హిందస్తాన్, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లతో సమీక్ష తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారని చెప్పారు.

దేశంలోని ఐదు నగరాలలో ఉన్న 109 పెట్రోలియం అవుట్ లెట్ లలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలులో ఉందన్నారు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల మార్పులకనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలలో రోజువారి మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.

డైనమిక్ ఆయిల్ ప్రైసింగ్ విధానం వల్ల తమకు నష్టమొస్తుందన్నారు పంజాబ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ సెహగల్. తమకు మార్జిన్ మనీ మిగలదన్నారు. రెండు వారాలకోసారి ప్రైసింగ్ విధానంలో పెట్రోలియం స్టాక్ ను ధరలను బట్టి నిలువ ఉంచుకునేవాళ్లం అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సెహగల్.

మే 1కి పెట్రోలియం, డీజిల్ ధరలను ప్రకటించింది ఆయిల్ కార్పోరేషన్. పెట్రోల్ పై ఒక పైసా పెరగగా.. డీజిల్ పై 44 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించింది.