ఆ ప్రాజెక్టు పాతదే

1

– బాబు.. నీ కుట్రబుద్ధి మార్చుకో..:మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జనంసాక్షి):

పాలమూరు ?రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కుట్రలు చేస్తున్నరని ఆప్రాజేక్టులు  మంత్రి హరీష్‌ రావు అన్నారు.   పాలమూరు ఎత్తిపోతల, డిండి పాత ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. ఈ రెండు ప్రాజెక్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక ¬దా సాధించలేని చంద్రబాబు.. ఆంధ్రా ప్రజలను పక్కదారి పట్టించటానికే పాలమూరు, డిండి ప్రాజెక్టులపై డ్రామాలు ఆడుతున్నడని మండిపడ్డారు. పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలు బాగుపడితే ఓర్వలేక పోతున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేవంటూ ఏపీ సర్కార్‌ రాసిన లేఖకు హరీష్‌ రావు కౌంటర్‌ లెటర్‌ రాశారు.

ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో మంత్రి హరీష్‌ రావు పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ఎత్తిపోతల పథకం కడతామని మాటిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణకు 290 టిఎంసిల నికరజలాలతో పాటు 368 టిఎంసిల వాటా కృష్ణా జలాల్లో ఉందని చంద్రబాబు చెప్పిన సంగతిని పేర్కొన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 70 టిఎంసిల నీటితో పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని, దానికి సర్వే చేయమని 72వ నంబరు జీవో కూడా విడుదల చేశారని వివరించారు.

2014 ఎన్నికల సందర్భంగా ఏప్రిల్‌ నెలలో మహబూబ్‌ నగర్‌ లో టిడిపి-బిజెపి నిర్వహించిన సంయుక్త ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావించిన సంగతిని ప్రస్తావించారు. యేండ్లు గడిచినా తల్లీకొడుకులు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారని సోనియా, రాహుల్‌ గాంధీలను విమర్శించిన సంగతిని లేఖలో పేర్కొన్నారు.

ఆ ఎన్నికల్లోనే రాహుల్‌ గాంధీ కూడా తాము మళ్లీ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం కడతామని హావిూ ఇచ్చారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుపిఏ, ఎన్డీఏ రెండూ ఒప్పుకున్నాయని మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు.

కృష్ణానది జలాల్లో తెలంగాణకు ఉన్న వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఏపీ సర్కార్‌ కు రాసిన లేఖలో మంత్రి హరీష్‌ రావు తేల్చిచెప్పారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు నీటి వాటా పెరగబోతున్నదని ఆయన వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు రావాల్సిన 197 టిఎంసిల వరద జలాల్లో తెలంగాణ వాటా తేలాల్సి ఉందన్నారు. సగం వాటా వచ్చినా దాదాపు వంద టిఎంసిలు తెలంగాణకు వస్తాయన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం దిగువ రాష్ట్రాలు నదీ జలాలను మళ్లించుకుంటే వాటిలో ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలన్న విషయాన్ని లేఖలో మంత్రి హరీష్‌ రావు గుర్తు చేశారు. గోదావరిపై పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి ఏపీ 80 టిఎంసిల నీటిని మళ్లించుకుపోతోందని.. దీని ప్రకారం కృష్ణా నీటిలో తెలంగాణకు మరో 45 టిఎంసిల నీటి వాటా ఉంటుందన్నారు.

ఏ నదీ జలాల్లో అయినా ముందు తాగునీటికి కేటాయింపులు జరపాలన్న విషయాన్ని లేఖలో హరీష్‌ రావు గుర్తుచేశారు. కృష్ణా బేసిన్‌ లో ఉన్న హైదరాబాద్‌ నగరానికి కృష్ణా నీటినే ఇవ్వాలన్నారు. హెచ్‌ఎండిఏ పరిధిలో కోటి 42 లక్షల జనాభా ఉందని.. వీరికి తాగునీరు అందించాలంటే ఏటా దాదాపు 60 టిఎంసిల నీరు కావాలన్నారు. దీనికోసం కృష్ణానది నుంచి నీరు తీసుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు.

శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో హైదరాబాద్‌ నగరంలో 40 లక్షల మంది ఆంధ్ర వాళ్లున్నారని ఆంధ్రాపార్టీలు రాసిన విషయాన్ని మంత్రి హరీష్‌ రావు లేఖలో ప్రస్తావించారు. ఈ 40 లక్షల మంది ఆంధ్రోళ్లు హైదరాబాద్‌ నగరానికి నీళ్లు రాకుండా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరానికి 60 టిఎంసిల నీరు వాడుకుంటే, అందులో 25 టిఎంసిలు ఆంధ్రాపార్టీలు చెప్పిన లెక్క ప్రకారం ఆంధ్ర ప్రజలే వాడుకుంటారని చెప్పారు. హైదరాబాద్‌ లోని విూ ప్రజలకు నీరివ్వద్దని విూరే చెబుతారా? అని హరీష్‌ రావు నిలదీశారు.

అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని మాట్లాడుతున్న చంద్రబాబు.. పట్టిసీమకు ఎవరి అనుమతి ఉందో చెప్పాలని హరీష్‌ డిమాండ్‌ చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు-నగరి, పులిచింతల లాంటి పథకాలను ఎవరి అనుమతి తీసుకుని కట్టారో చెప్పాలన్నారు. రాష్ట్రాలకున్న నీటి వాటా ప్రకారం ప్రాజెక్టులు కట్టుకునే హక్కు ఏ రాష్ట్రానికైనా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ హక్కు ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, డిండి ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం కృష్ణా నదిలో 300 టిఎంసిల నీరు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని లేఖలో మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా కనీసం వంద టిఎంసిలు కూడా తెలంగాణకు రావటం లేదన్నారు. నికర కేటాయింపులతోనే ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం తెలంగాణకు ఉందన్నారు. ఇంకా కేటాయించాల్సి ఉన్న దాదాపు 100 టిఎంసిల వరద జలాలు, పట్టిసీమకు పరిహారంగా రావాల్సిన 45 టిఎంసిలు, హైదరాబాద్‌ నగర మంచినీటి కోసం ఇవ్వాల్సిన వాటా, నాగార్జున సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడిక బాపతు నీళ్ల వాటా తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. ఇవన్నీలెక్క కలిపితే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు లాంటి మరో ఐదారు ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉందని మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు.

చంద్రబాబు ఇప్పటికైనా పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులపై కుట్రలు మానుకోవాలని మంత్రి హరీష్‌ రావు హితవు చెప్పారు. సమైక్యరాష్ట్రంలో దగా పడిన పాలమూరు ప్రజలు బాగుపడుతుంటే ఓర్వలేనితనం ప్రదర్శించడం మంచిదికాదన్నారు.

తాజావార్తలు