ఆ ముసలాయన మరెవరో కాదు.. ఆసీస్ మాజీ ఆటగాడు బ్రెట్‌లీ
ముంబయి: నెరిసిన జుట్టు.. పాలిపోయిన మొహం… దీనంగా కనిపిస్తున్న ఈ ముసలాయన ఎవరో గుర్తుపట్టగలరా? అయితే, చిన్న క్లూ. ఆయనో మాజీ క్రికెటర్. తనదైన బౌలింగ్ శైలితో బ్యాట్స్‌మెన్లకు ముచ్చెమటలు పట్టించిన ఫాస్ట్‌బౌలర్. అగ్రశ్రేణి జట్టుకు ఏళ్లపాటు సేవలందించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. ఐపీఎల్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇంకా గుర్తుకు రాలేదా? ఆ ముసలాయన మరెవరో కాదు.. ఆసీస్ మాజీ ఆటగాడు బ్రెట్‌లీ! మరి ఈ వేషమేంటి అనుకుంటున్నారా? ఐపీఎల్ వ్యాఖ్యాతగా బిజీగా ఉన్న అతడు వేషం మార్చి ఇలా ముంబయిలోని స్థానిక గ్రౌండ్‌లో అడుగుపెట్టి చిన్నారులను ఆటపట్టించాడు. తొలుత క్రికెట్ ఆడటమెలాగో నేర్పించమంటూ పిల్లలను బతిమాలాడు. కాసేపు
చిన్నారులు చెప్పిన మెలకువలను జాగ్రత్తగా విని అసలు బ్యాట్ పట్టడం రాదన్నట్లుగా.. బంతి విసరడమే తెలియదన్నట్లుగా ప్రవర్తించసాగాడు. తర్వాత సిక్సర్లతో విరుచుకుపడుతూ.. వరుసగా వికెట్లు తీస్తూ చిన్నారులను బెంబేలెత్తించాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన చిన్నారులు ‘‘నువ్వో ముసలి వ్యక్తివి. అసలు ఈ వయస్సులో ఇంత బాగా ఎలా ఆడుతున్నావు’’ అని అడిగారు. వెంటనే తన వేషం తీసేసి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. దీంతో చిన్నారులంతా ఆనందంతో అతని నుంచి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను స్టార్‌స్పోర్ట్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. మరి ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి!