ఇంకెన్నాళ్లు సీమాంధ్ర దురహంకారం?
‘తెలంగాణ కోసం ఎవరూ బలిదానాలు చేసుకోలేదు. వాళ్లంతా రోగాలచ్చి చచ్చిపోయారు. టీబీ, పోలియో, క్యాన్సర్, గుండెజబ్బులతో, నక్సలైటు కాల్పుల్లో మరణించారు తప్పితే వారివి ఆత్మహత్యలు కావు.’ ఇవీ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేణుకను విలేకరులు తెలంగాణ ఆత్మబలిదానాలపై ప్రశ్నించగా ఆమె కల్లుతాగిన కోతిలా ప్రవర్తించారు. తన తాబేదారు తనం అందిపుచ్చుకున్న రాజ్యసభ సీటు ఉందనే ధీమాతో ఆమె ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రాంతీయురాలైన రేణుకాచౌదరిని తెలంగాణ ప్రజలు 2004 ఎన్నికల్లో అక్కున చేర్చుకున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి గెలిపించి పార్లమెంట్‌కు పంపారు. తనను గెలిపించిన ప్రజలకు ఏమీ చేయకపోగా వారి ఆకాంక్షను అపహాస్యం చేస్తూ.. వారి బలిదానాలను, ఆత్మత్యాగాలను అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. 2009 ఎన్నికల్లో ఘోర పరాభావం మూటగట్టుకున్న తర్వాత ప్రత్యక్ష ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోయిన రేణుక ఢిల్లీలో తెలిసిన వాళ్ల కాళ్లావేళ్లా పడి రాజ్యసభ సీటు తెచ్చుకున్న సంగతి ఆమె వెంట తిరిగే నేతలే బహాటంగా చెప్తుంటారు. టెన్ జన్‌పథ్‌తో, సోనియాగాంధీతో తనకు ఉన్న సంబంధాలు ఎంత వరకైనా తీసుకెళ్తాయని, ఇంకా ప్రజలతో ఏంటి సంబంధం అన్నట్లుగా ఆమె కొంతకాలంగా ప్రవర్తిస్తున్నారు. తాను పుట్టిన గడ్డకు మాత్రమే నేత అయినట్లు, ఒకప్పుడు ఓట్లేసి గెలిపించిన ప్రజలు పురుగులన్నట్లుగా ఆమె మాట్లాడారు. సీమాంధ్ర లాబీలో కీలకనేతగా మారి ఢిల్లీలో తెలంగాణ అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దానిని బహిర్గతం చేస్తూనే ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన మాటలను చూస్తే తెలంగాణ ప్రజలపై ఎంతగా అక్కసు పెంచుకున్నారో అర్థమవుతోంది. తెలంగాణ కోసం వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారు. వారిలో కొందరు బహిరంగంగా తమను తాము దహించుకొని ఒళ్లంతా కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కూడా జై తెలంగాణ నినాదాలే చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసమే తాము ప్రాణత్యాగానికి సిద్ధ పడినట్లుగా మరణ వాంగ్మూలమిచ్చినా వాటిని అవహేళన చేస్తూ చులకనగా మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య సర్వీసు తుపాకీతో కాల్చుకొని జై తెలంగాణ నినాదాలు చేస్తూ తుదిశ్వాస విడిచాడు. ఎంతోమంది ఉజ్వల భవిత ఉన్న యువత ఉరికొయ్యలపై ఊపిరి తీసుకున్నారు. వీరి బలిదానానికి సీమాంధ్ర సర్కారు, అక్కడి పెట్టుబడిదారుల ప్రయోజనాలే కారణమైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించలేదు. ఎక్కడ వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయరేమోనని కొందరు నేతలు విద్యార్థుల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారే తప్ప బలిదానాలు ఆపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. సీమాంధ్ర నేతలు పదవీత్యాగం పేరుతో వచ్చిన తెలంగాణను అడ్డుకున్నా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవులు పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు. అధిష్టానంపై వీరవిధేయత ప్రకటించి అమ్మ పదవి ఇస్తుందనే నమ్మకాన్ని చాటారు. నెలరోజుల్లో తెలంగాణపై తేల్చేస్తామని మోసగించినా మన నేతల్లో అధిష్టానంపై, అమ్మపై నమ్మకం సన్నగిల్లలేదు. అమ్మ మాటంటే మాటే తెలంగాణ ఇచ్చేస్తారని పాతపాటే పాడారు. దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పి మోసగిస్తూనే ఉన్న వీరికి బానిస మనస్తత్వం మాత్రం మారడం లేదు. అదే సీమాంధ్ర పెట్టుబడిదారులు, పెద్దలు, పాలకులు అడుగడుగునా తెలంగాణకు అడ్డుపడుతూ అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ ఆకాంక్షను తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరి ప్రయోజనాల కోసం తెలంగాణ ఉద్యమం సాగుతున్నట్లు.. ఆయన రెచ్చగొట్టడం వల్లే ప్రజలు రెచ్చిపోతున్నట్లు చరిత్రను వీలైనంతవరకు వక్రీకరించి చూపుతున్నారు. రేణుకా, లగడపాటి, కావూరి, రాయపాటి లాంటి పెట్టుబడిదారి శక్తులు, ఢిల్లీ తాబేదార్లు ప్రజల ఆకాంక్షలను అవమానపరుస్తున్నా తెలంగాణ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్న ఒక్కరూ నోరు తెరిచి మాట్లాడలేదు. రేణుక వ్యాఖ్యలను ఖండించలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పే ప్రయత్నం చేయలేదు. సీమాంధ్ర దురహంకారం మన మంత్రులకు అలవాటమేగాని తెలంగాణ ప్రజలు ఎంతమాత్రం దీనిని సహించబోరు. ఆరేళ్లు కడుపుల చల్ల కదలకుండా రాజ్యసభలో కూర్చిండిపోతాను ప్రజలతో నాకేంటి సంబంధం అనుకుంటే మొత్తంగా వాళ్లు అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీనే తుడిచిపెట్టేస్తారు. దేశ, రాష్ట్ర చరిత్రలో అలా తుడిచిపెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇది రేణుక చౌదరి తెలియదేమో గానీ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలందరికీ తెలిసిందే. అధికారం ఉందనే అహంకారంతో ప్రజల ఆకాంక్షలను తక్కువ చేయాలని చూస్తే.. త్యాగాలను అవమానిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారు.